హైదరాబాద్: ఇప్పడు దేశవ్యాప్తంగా సినీ అభిమానులను పట్టి ఊపేస్తున్నవి రెండే చిత్రాలు – ఒకటి బాహుబలి, రెండోది బజరంగీ భాయ్‌జాన్(రెండింటినీ BBగానే సంబోధిస్తుండటం విశేషం). మొదటిది దేశవ్యాప్తంగా పదిరోజుల్లో 350 కోట్లు సంపాదించగా రెండోది మూడు రోజుల్లోనే 100 కోట్లు కొల్లగొట్టి రికార్డ్ సృష్టించింది. వారం తేడాతో విడుదలై చరిత్ర సృష్టిస్తున్న ఈ రెండు చిత్రాలకూ ఒక సంబంధం ఉంది. ఈ రెండు చిత్రాలకూ కథను అందించింది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాదే. పాకిస్తాన్లో వైద్య ఖర్చు భరించలేక భారత్ వచ్చి తమ కూతురికి గుండె ఆపరేషన్ చేయించుకున్న పాక్ దంపతులగురించి మీడియాలో తెలుసుకుని బజరంగీ భాయ్ జాన్ కథ రాశానని విజయేంద్రప్రసాద్ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బాహుబలి రాజమౌళి తీయబోయే మహాభారతం చిత్రానికి ఒక చిన్న నమూనామాత్రమేనని అన్నారు.
అసలు బజరంగీ భాయ్ జాన్ చిత్ర కథను విజయేంద్రప్రసాద్ మొదట స్టైలిష్ స్టార్ బన్నీకోసం తయారు చేశారట. అయితే బన్నీ ఆ కథ తనకు నప్పుతుందో, లేదో అని భయపడి పక్కన పెట్టారట. రజనీకాంత్‌కు ఈ కథను విజయేంద్రప్రసాద్ వినిపించగా, తర్వాత చేద్దామని రజనీ వాయిదా వేశారని సమాచారం.
మరోవైపు బాహుబలి, బజరంగీ…చిత్రాల డబుల్ ధమాకా విజయంతో విజయేంద్ర ప్రసాద్‌కు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. బాలీవుడ్లో ఒక చిత్రం హిట్ అయితే చాలు ఆ చిత్రానికి పనిచేసిన వారికి విపరీతంగా ఆఫర్లు వచ్చి పడిపోతుంటాయి. అలాంటిది రెండు చిత్రాలు హిట్ అయితే చెప్పేదేముంది! అయితే విజయేంద్ర ప్రసాద్ తక్కువేమీ తినలేదు. తనదగ్గర ఒక డజను కథలు ఎప్పుడూ రెడీగా ఉంటాయని చెప్పుకొచ్చారు.