మార్చి 19న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరుగబోయే భారత్-పాక్ టి-20 క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ఏడుగురు పాక్ దౌత్యవేత్తలకు భారత్ అనుమతి నిరాకరించడంతో పాక్ అందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ విదేశాంగ శాఖ పాకిస్తాన్ లో భారత హైకమీషనర్ జెపి సింగ్ ద్వారా భారత్ కి తమ నిరసన తెలియజేసింది. పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి మొన్న నేపాల్ లో భారత్ విదేశాంగ కార్యదర్శి ఎస్. జయ్ శంకర్ ని కలిసినప్పుడు ఈ విషయం గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.
అయినప్పటికీ పాక్ ఒత్తిడికి భారత్ తలొగ్గలేదు. కానీ డిల్లీలో పనిచేస్తున్న19 మంది పాక్ దౌత్యవేత్తలకు ఈ మ్యాచ్ చూసేందుకు కోల్ కతా వెళ్లేందుకు అనుమతించింది. అవసరమయితే మరి కొంతమందికి కూడా అనుమతిస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలియజేసారు.
“ఇటువంటి విషయాలలో కొన్ని నియమ నిబంధనలు పాటించవలసి ఉంటుంది. వాటి ప్రకారమే ముందుగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని మేము చాలాసార్లు పాకిస్తాన్ కి చెప్పాము కానీ వారు ఆ విషయంలో అశ్రద్ధ చూపుతుంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. అందుకే ఈ సమస్య తలెత్తింది. అయినప్పటికీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మొత్తం 19మంది పాక్ దౌత్యవేత్తలకు మ్యాచ్ చూసేందుకు భారత్ అనుమతి మంజూరు చేసింది,” అని వికాస్ స్వరూప్ చెప్పారు.
అయితే ఈ మ్యాచ్ చూసేందుకు పాకిస్తాన్ నుంచి భారత్ రావలనుకొన్న ఏడుగురు దౌత్యవేత్తలలో ఐదుగురికి పాక్ గూడచార సంస్థ ఐ.ఎస్.ఐ.తో సంబంధం ఉన్న కారణంగా వారికి కోల్ కతా వచ్చేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.