విశాఖపట్నం (పశ్చిమ) మాజీ వైకాపా ఎమ్మెల్యే మళ్ళ విజయ్ ప్రసాద్ ఇల్లు, కార్యాలయాలపై సిబీఐ అధికారులు దాడులు చేసారు. రియల్ ఎస్టేట్ మరియు చిట్ ఫండ్ వ్యాపారాలు చేస్తున్న ఆయనకు చెందిన వెల్ ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా పశ్చిమ బెంగాల్, బిహార్, ఓడిసా, జార్ఖండ్ రాష్ట్రాలలో కలిపి మొత్తం 33 శాఖలున్నాయి. వాటిలో విశాఖలో ఉన్న ప్రధాన శాఖకు ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా, మిగిలిన వాటిలో డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు.
వెల్ ఫేర్ గ్రూపుకు చెందిన చిట్ ఫండ్ సంస్థ ఎక్కువ వడ్డీలు ఆశ జూపి ప్రజలను కోట్లాది రూపాయలు డిపాజిట్లు సమీకరించి, అసలు, వడ్డీలు చెల్లించకుండా ప్రజలను మోసం చేస్తున్నట్లు ప్రజల నుండి పిర్యాదులు అందుతున్నాయి. అలాగే వెల్ ఫేర్ గ్రూప్ప్ కి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ కూడా మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో స్థలాలు ఆఫర్ చేసి, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి, వారికి స్థలాలు ఇవ్వకుండా, వారు చెల్లించిన డబ్బు వాపసు చేయకుండా చాలా మందిని మోసం చేస్తున్నట్లు పిర్యాదులు వచ్చేయి.
జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు సిబీఐ అధికారులు నిన్న ఒకేసారి ఐదు రాష్ట్రాలలో ఉన్న ఆయన కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. విశాఖలోని మళ్ళ విజయ్ ప్రసాద్ ఇల్లు, కార్యాలయాల నుంచి సుమారు 44 లక్షల నగదు కొన్ని ముఖ్యమయిన పత్రాలను సిబీఐ అధికారులు స్వాధీనం చేసుకొన్నట్లు తెలుస్తోంది. మళ్ళ విజయ్ ప్రసాద్ తో సహా ఆ సంస్థ డైరెక్టర్లందరిపై సిబీఐ కేసులు నమోదు చేసింది.