వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో వెంటవెంటనే ప్రవేశపెట్టిన రెండు అవిశ్వాస తీర్మానాల్లో సభా నిబంధనలు వక్రీకరించబడ్డాయి. పాలకపక్షం నీతిని పతనం చేసింది. జగన్ అనుభవరాహిత్యం, మొండితనం ఆయన పార్టీని నవ్వులపాలు చేసింది.
తమ పార్టీలోకి ఫిరాయించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా చూసుకోవడమొక్కటే ఏకైక లక్ష్యంగా తెలుగుదేశం వ్యవహారాన్ని నడిపించింది. అందుకోసం అన్ని నిబంధనలను ఇష్టానుసారం ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి చిల్లులుపొడవడమే.
ప్రభుత్వం సరైన దారిలో పని చేయనప్పుడు, వైఫల్యాలు తరచు తలఎత్తుతున్నప్పుడు ఆప్రభుత్వం మీద చట్టసభల్లో అవిశ్వాసం ప్రతిపాదించే హక్కు ప్రతిపక్షానికి, ప్రతి సభ్యునికీ వుంది. తమపై వచ్చిన ఆరోపణలకు సరైన సమాధానాలు చెప్పడం ద్వారా ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. చర్చ ముగిశాక సభలో వచ్చిన ఆరోపణలపై సభా నాయకుడిగా ముఖ్యమంత్రి తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. సోమవారంనాటి ‘అవిశ్వాసం’లో ఈ సంప్రదాయం పాటించలేదు.
మధ్య మధ్య సిఎం, మంత్రులు జోక్యం చేసుకోవడమే సమాధానం అనే కొత్త ధోరణిని తెలుగుదేశం ప్రదర్శించింది. ప్రతిపక్ష నేత మాట్లాడటం పూర్తి కాకుండానే, తలల లెక్కింపు (డివిజన్)లేకుండా మూజువాణితో అవిశ్వాసం వీగిపోయేలా చేయడం నిబంధనల ప్రకారం తప్పుకాకపోవచ్చేమో కాని నైతికంగా పతనమే!
స్పీకర్ కోడెల శివప్రసాద్ పై విపక్షం ప్రతిపాదించిన అవిశ్వాసం సందర్భంగా ప్రభుత్వం పాటించిన పద్ధతులు కూడా అనైతికమే. గతంలో స్పీకర్‌గా పని చేసిన రోజుల్లో సభలో నైతిక విలువలను ప్రవేశపెట్టారన్న పేరు తెచ్చుకున్న సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ఇపుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం ఆశ్చర్యకరం. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మాన ప్రక్రియపై సభ నియమావళిలోని 71, 72, 73 నిబంధనలు వివరిస్తున్నాయి. వాటిలో తమకు అనుకూలంగా ఉన్నవాటిని తీసుకొని, ఇబ్బంది కలిగించే వాటిని తాత్కాలికంగా నిలుపుదల (సస్పెండ్) చేయించారు యనమల. అందుకు 358 నిబంధనను వాడుకున్నారు. ఏ నియమాన్నైనా సస్పెండ్ చేసేందుకు ఆ నిబంధన ఉపయోగపడుతుంది. అసాధారణ పరిస్థితుల్లోనే దాన్ని వాడుతుంటారు. ఇప్పుడు సభలో ఆ నిబంధన వాడాల్సిన పరిస్థితి లేదు.
అవిశ్వాసం సందర్భంగా వైసిపి విప్ జారీ చేస్తే, సభలో డివిజన్ పెడితే టిడిపిలోకి ఫిరాయించిన వారి సభ్యత్వాలు ఎగిరిపోతాయి. అర్హనతవేటు పడితే ఉపఎన్నికలు అనివార్యమవుతాయి. ఎన్నికల్లో ఓటమి భయం వల్లే మొదటి అవిశ్వాసంలో మూజువాణిని ఫిరాయింపుదార్లను కాపాడారు.
విమర్శలు రావడంతో రెండో రోజు తలల లెక్కింపు పెట్టినా విప్ జారీ చేయడానికి సమయం లేకుండా, ఒకవేళ చేసినా సులభంగా ఆ ఎమ్మెల్యేలు అనర్హత నుంచి తప్పించుకునేలా వ్యూహాన్ని రూపొందించి బయటపడ్డారు.
సంఖ్యా బలం ఉన్నా, అవిశ్వాసాలతో అధికారానికి ముప్పు లేకున్నా ఇలా అడ్డదారులు తొక్కడం ప్రజాస్వామిక చర్చపట్ల ప్రభుత్వ పార్టీ భయాన్నే బయటపెట్టింది. జగన్ పార్టీనుంచి తనలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల పదవులను కాపాడటానికి ఇన్ని అనైతిక పద్ధతులకు పాల్పడి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా గాయపరచింది.ఇది హత్య, లేదా హత్యాప్రయత్నం కంటే తక్కువేమీకాదు.
రెండు అవిశ్వాస తీర్మానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయింది. బలంలేనప్పుడు ఈ ప్రయత్నాలెందుకని నవ్వులపాలైంది..అయితే ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. ప్రభుత్వ అనైతిక పద్ధతులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలా వరకూ విజయవంతమైంది
ఫిరాయింపుదారులను రక్షించే విషయంలో తెలుగుదేశం వ్యూహం ఫలించి ఉండవచ్చు కానీ అవిశ్వాసాల సందర్భంగా వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పలేని వైఫల్యం ఎన్నికలవరకూ ఆపార్టీని వెంటాడుతూనే ఉంది.