ఏడాది కాలం శాసనసభనుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే రోజా.. హైకోర్టులో ప్రస్తుతానికి విజయం సాధించారు. ఈ విషయంలో ఇంకా వాదనలు వినాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి ఆమె సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఆమె గురువారం నాడే శాసనసభకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు రోజా మీద సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ కోర్టు ఆదేశించింది. నాలుగువారాల తర్వాత.. మరోసారి ఈ కేసులో హైకోర్టు వాదనలు వింటామని ప్రకటించింది. అప్పటివరకు రోజా ఎప్పటిలాగానే శాసనసభకు హాజరు కావడానికి వీలుంటుంది.
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కాల్‌మనీ వ్యవహారంలో రభస జరిగిన నేపథ్యంలో రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు మీద దూకుడుగా మాట్లాడారనే ఆరోపణల మీద ఆమెను సభనుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దాని మీద ఆమె హైకోర్టును ఆశ్రయించి, అక్కడ జాప్యం అవుతున్నదంటూ… సుప్రీం కోర్టుకు వెళ్లి అక్కడినుంచి హైకోర్టుఉ ఆదేశాలు ఇప్పించుకుని తిరిగి ఇక్కడ పిటిషన్ వేశారు. దానిపై గురువారం రోజాకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి.
హైకోర్టు తీర్పు ద్వారా రోజా సాధించిన విజయం ఒక రకంగా తెలుగుదేశం పార్టీ దూకుడుకు ఎదురుదెబ్బ అని చెప్పాల్సిందే. సభలో తమకు మెజారిటీ ఉన్నది కదాని.. ఎలాపడితే అలా నిర్ణయాలు తీసుకుంటే.. న్యాయస్థానం ముందు అయినా.. దెబ్బతినక తప్పదనడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ. ఏ రూల్ ప్రకారం అయితేరోజా సస్పెన్షన్‌ను ప్రకటించారో.. ఆరూలు ప్రకారం ఒక సెషన్ ముగిసేవరకే తప్ప ఏడాది వేటు వేయడం కుదరదు. అదే నిబంధనపై కోర్టును ఆశ్రయించిన రోజా ఇవాళ విజయం సాధించారు. కోర్టు ద్వారా తాను సాధించిన విజయం తన నియోజకవర్గ ప్రజలది అంటూ రోజా తీర్పు అనంతరం వ్యాఖ్యానించారు. న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తీర్పు కాపీ చేతికి అందగానే.. ఇవాళ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళతానని ఆమె చెప్పారు.
స్పీకరు నిర్ణయాన్ని కొట్టిపారేస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఏపీ శాసనసభ ప్రివిలేజీ కమిటీ ఇవాళ సమావేశం కానున్నట్లుగా తెలుస్తున్నది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో జరగనున్న ఇతర పరిణామాల గురించి చర్చించడానికి ప్రివిలేజి కమిటీ సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తున్నది. మరి తెలుగుదేశం సర్కారు, స్పీకరు కోడెల ఈ పరాభవం పట్ల ఎలా స్పందిస్తారోచూడాలి.