ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య మళ్ళీ గొడవలు మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో గోదావరి నదిపై తెలంగాణా ప్రభుత్వం నిర్మించతలపెట్టిన శ్రీ సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పు పట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు (?) అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, గోదావరి జలాలలో 950 టి.ఎం.సి.లు తెలంగాణా రాష్ట్రానికి కేటాయించిన సంగతి అందరికీ తెలుసని కేసీఆర్ అన్నారు. ప్రాణహిత, మేడిగడ్డతో సహా అన్ని ప్రాజెక్టులు కట్టుకొన్నా కూడా తెలంగాణా రాష్ట్రం 950 టి.ఎం.సి.ల నీళ్ళను వాడుకొనే పరిస్థితి ఉండదని, కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పారు. తాము వాడుకోగా మిగిలిన నీళ్ళను ఆంధ్రప్రదేశ్ నిరభ్యంతరంగా వాడుకోవచ్చని కేసీఆర్ అన్నారు.
ఎగువనున్న మహారాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది కానీ దిగువనున్న ఆంధ్రప్రదేశ్ సహకరించడం లేదని కేసీఆర్ విమర్శించారు. అయినా ఈ ప్రాజెక్టులు ఏవీ కొత్తగా మొదలుపెడుతున్నవి కావని, ఇదివరకే సమైక్య రాష్ట్రంలోనే ఈ ప్రతిపాదనలు చేసారని మరి అటువంటప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని కేసీఆర్ ప్రశ్నించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు క్రింద ఉండే రుద్రంకోట తదితర ప్రాంతాలను పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలుగా గుర్తించి ఆంధ్రాలో కలపడం వలన ఇప్పుడు మారిన తెలంగాణా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా దుమ్ముగూడెం ప్రాజెక్టు డిజైన్ న్ని కూడా మార్చుకోవలసి వస్తోందని అన్నారు. ఖమ్మం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై బుధవారం సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న శాసనసభలో విభజన చట్టంలోని సెక్షన్: 8 గురించి, షెడ్యూల్స్ 9,10 క్రింద వచ్చే సంస్థల పంపకాలు, ఉద్యోగుల పంపకాల గురించి మాట్లాడారు. ఇవ్వన్నీ కూడా వివాదాలతో కూడుకొన్నవే. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటన్నిటి కోసం ఒత్తిడి తెచ్చి, తెలంగాణా ప్రభుత్వం నిర్మించబోతున్న ఈ ప్రాజెక్టులపై గట్టిగా అభ్యంతరాలు తెలపదలిస్తే మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది.