కొంతమంది జీవితాలంతే. చావు ముహూర్తం కూడా ముందే తెలిసిపోతుంది. 1993లో సంభవించిన ముంబై బాంబు ప్రేలుళ్ల కేసులో దోషిగా నిర్ధారించబడిన యాకూబ్ మెమన్ చావు ముహూర్తాన్ని ఏ శక్తి ఆపలేదు. సుప్రీంకోర్టు మంగళవారంనాడు మినహాయింపు పిటీషన్ ను కొట్టివేయడంతో ఈనెల (జులై) 30వ తేదీన యాకూబ్ కు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. నాగపూర్ సెంట్ల్ జైల్ లోకానీ, లేదా పుణె ఎరవాడ జైలులో కానీ ఉరిశిక్ష అమలుచేయవచ్చు. 53 ఏళ్ల యాకూబ్ కు అదే రోజున (జులై 30) పుట్టినట్టు రికార్డ్ ల్లో ఉంది.
క్రిందటి ఏడాది తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని వేడుకున్నప్పటికీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. దీంతో తనకు ఉరిశిక్షనుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటీషన్ ను కూడా సుప్రీం కొట్టివేయడంతో అతని ఉరిశిక్ష అమలు తప్పదని తేలిపోయింది. 1993 ప్రేలుళ్ల కేసులో ఉరిశిక్షకు గురవుతున్న మొదటి వ్యక్తి ఇతనే. అయితే, 1995లో ఆటో శంకర్ ఉరితీత సంఘటన నుంచి లెక్కగడితే యాకూబ్ ఉరిశిక్ష ఐదవది అవుతుంది.
2013 ఫిబ్రవరి 9న జమ్మూకాశ్మీర్ కు చెందిన అఫ్జల్ గురూకి ఉరిశిక్ష అమలుచేశారు. 2001లో పార్లమెంట్ పై దాడికేసులో దోషిగా నిర్థారణకావడంతో అతనికి ఈ శిక్ష విధించారు. 2004లో సుప్రీంకోర్టు అతనికి మరణశిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది.
అంతకు ముందు 2012 నవంబర్ 21న అజ్మల్ అమిర్ కసబ్ కు పూణె జైలులో ఉరిశిక్ష అమలుచేశారు. 2008నాటి ముంబై టెర్రర్ ఎటాక్ కేసులో పట్టుబడిన ఏకైక పాకిస్తానీ ఉగ్రవాది ఇతను. ఇతనిపై 86 నేరారోపణలు మోపబడ్డాయి. ఇందులో భారతదేశంపై యుద్ధం ప్రకటించడం వంటి సీరియస్ కేసులున్నాయి. ఇతని అభియోగాల ఛార్జిషీటే పదకొండువేల పేజీలున్నదంతే ఈ కేసు తీవ్రత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, ఒక నాన్ ఇండియన్ గా , ఒక విదేశీయునిగా ఉరికంబం ఎక్కిన తొలి దోషి ఇతనే.
ఇంకాస్త వెనక్కి వెళితే, 2004 ఆగస్టు 14న సెక్యూరిటీ గార్డ్ ధనుంజయ్ ఛటర్జీని ఉరితీశారు. పశ్చిమబెంగాల్ లోని భోవనిపోర్ లో 18ఏళ్ల హేతల్ పరేఖ్ ను రేప్ చేసి మర్డర్ చేసిన కేసులో ఇతను దోషి. బాధితురాలు ఉంటున్న కాంప్లెక్స్ కు ఇతను సెక్యూరిటీ గార్డ్ గా ఉండేవాడు. 1990 మార్చి 5న సంఘటన జరగ్గా, 1991 ఆగస్టు 12న అతనికి ఉరిశిక్ష ఖరారైంది.
1995 ఏప్రిల్ 27న గౌరిశంకర్ అనబడే ఆటో శంకర్ ను ఉరితీశారు. 1980 ప్రాంతంలో చెన్నైలో ఆరు హత్యలు, అనేక ఇతర నేరాలకు పాల్పడ్డ గ్యాంగ్ కి ఇతను లీడర్. 1988లో అతణ్ణి అరెస్టు చేశారు. 1991 మే 31న మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది.
– కణ్వస