వైకాపా ఎమ్మెల్యే రోజాపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ విధించిన సస్పెన్షన్ న్ని ఎత్తివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో, ఆ తీర్పు కాపీలను పట్టుకొని రోజా మరికొద్ది సేపటిలో శాసనసభ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. ఆమె నేటి నుంచి శాసనసభ సమావేశాలకు యధాప్రకారం హాజరు కావచ్చునని హైకోర్టు తన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇది తెదేపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ వంటిదేనని చెప్పకతప్పదు. కనుక కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాలు చేయాలనుకొంటున్నట్లు తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర రావు చెప్పారు.
“సెక్షన్: 212 ప్రకారం శాసనసభ వ్యవహారాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. స్పీకర్ నిర్ణయాన్ని, అయన అధికారాలను న్యాయస్థానాలు ప్రశ్నించడానికి కూడా వీలులేదు. కనుక శాసనసభ పరిధిలో ఉన్న రోజా వ్యవహారంపై సింగల్ జడ్జి తీసుకొన్న నిర్ణయాన్ని మేము డివిజన్ బెంచ్ లో సవాలు చేయాలని భావిస్తున్నాము. రోజాపై శాసనసభ విధించిన సస్పెన్షన్ న్యాయస్థానం ఎత్తివేసినప్పటికీ, ఒకవేళ శాసనసభ స్పీకర్ తన నిర్ణయానికే కట్టుబడి ఉండదలిస్తే, రోజాను శాసనసభలోనికి అనుమతించే అవకాశం లేదు. కోర్టు తీర్పు కాపీ మాకు అందగానే దీనిపై మేము చర్చించుకొని తగిన నిర్ణయం తీసుకొంటాము,” అని బొండా ఉమా మహేశ్వర రావు మీడియాకు చెప్పారు.
శాసనసభ వ్యవహారాలలో న్యాయస్థానాలు పరిమిత స్థాయిలోనే జోక్యం చేసుకోగలవనే ఆయన వాదన సహేతుకమే. అలాగే స్పీకర్ నిర్ణయాన్ని, ఆయన పరిధిలో ఉన్న అంశాలపై న్యాయస్థానాలు తీర్పులు చెప్పలేవనే మాట వాస్తవమే. అయితే రోజా విషయంలో తెదేపా ప్రభువ్తం మొదట తొందరపాటుగా వ్యవహరిస్తూ సభలో తీర్మానం చేసి ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేయడం వలననే ఆమెకు ఈ అవకాశం దక్కిందని చెప్పవచ్చును. ఆ తరువాత తెదేపా ప్రభుత్వం తన తప్పును గ్రహించి దానిని సరిదిద్దుకొనే ప్రయత్నంలో ఒక అఖిలపక్ష కమిటీని వేసి దాని చేత ఆమెతో సహా మరో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేల సస్పెన్షన్ కి సిఫార్సులు చేయించుకొంది. అదే పని మొదటే చేసి ఉండి ఉంటె అంతా శాస్త్రోక్తంగానే జరిగినట్లవుతుంది కనుక న్యాయస్థానాలు కూడా ఆమె పిటిషన్ న్ని పట్టించుకొనక పోయుండేవేమో?
రోజా పిటిషన్ పై న్యాయస్థానంలో వాదోపవాదాలు జరుగుతున్నపుడు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కూడా గమనించవలసిందే. ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నంత మాత్రాన్న శాసనసభలో ఆమె వ్యవహరించిన తీరును సమర్ధిస్తున్నట్లు భావించరాదని అన్నారు. సెక్షన్: 340(2) ప్రకారం ఆమెను ఒక సమావేశాల వరకే సస్పెండ్ చేయవచ్చనే నిబంధనను పరిగణనలోకి తీసుకొనే ఈ మధ్యంతర ఉత్తవ్రులు జారీ చేస్తున్నామని చెప్పారు. శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఆమె సస్పెన్షన్ పై ఎలాంటి నిర్ణయమయిన తీసుకొనే హక్కు, అధికారం ఉంటుందని న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేసారు. అంటే ఆమెని మళ్ళీ ప్రివిలేజ్ కమిటీ ద్వారా బయటకు సాగనంపే అవకాశం ఉందని న్యాయస్థానమే స్పష్టం చేస్తున్నట్లుంది.
అయితే ఆమెను బయటకు సాగనంపడం వలన తెదేపా అహం చల్లారవచ్చునేమో కానీ దాని వలన తెదేపా ప్రభుత్వం మరింత అప్రదిష్ట మూటగట్టుకోక తప్పదు. తెదేపా ప్రభుత్వం-రోజాల మధ్య పోరాటం కాస్తా తెదేపా ప్రభుత్వం-న్యాయస్థానాల పోరాటంగా మరే ప్రమాదం ఉంది. ఒకవేళ ఆమె మళ్ళీ అనుచితంగా వ్యవహరిస్తే ఆమెను మళ్ళీ సభ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఎలాగూ స్పీకర్ కి ఉంటుంది. కనుక న్యాయస్థానం తీర్పును గౌరవించి ఆమెను సభలోకి అనుమతించడమే అన్ని విధాల మంచిది. అలాగే రోజా కూడా జరిగిన దానికి స్పీకర్ కి క్షమాపణలు చెప్పుకొని ఈ వ్యవహారానికి ఇంతటితో ముగింపు పలికితే ఆమెకు గౌరవంగా ఉంటుంది.