రోజా అనే ఒక ఎమ్మెల్యే శాసన సభ లోకే ఒక ఏడాది పాటు రావడానికి వీల్లేదంటూ సభాపతి స్థానంలోని కోడెల శివప్రసాద రావు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలు చెల్లవంటూ ఇప్పుడు హై కోర్ట్ తీర్పు ఇచ్చేసింది. ఇక అక్కడినుంచే అసలు గొడవ మొదలయే ప్రమాదం కనిపిస్తోంది. తీర్పు రోజాకు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో వైసీపీ నాయకులంతా పండగ చేసుకోవడం తెలిసిందే. అయితే అదే సమయంలో నిర్ణయం స్పీకర్ ది కాదు.. సభది.. కోర్ట్ ఎలా జోక్యం చేసుకుంటుందంటూ కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఏతావాతా ఈ వ్యవహారం రకరకాల మలుపులు తిరిగి రెండు వ్యవస్థల మధ్య రాజ్యాంగ ప్రతిష్టంభన కు దారి తీసే ప్రమాదం ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.
వైసీపీ కి చెందినా సభ్యులు సభలో వ్యవహరించే తీరు, తమ డిమాండ్ లను ప్రస్తావించి విషయంలో వారు అనుసరించే దుడుకు వైఖరి విషయంలో తాము ఎలా స్పందించదలచుకున్నామో టీడీపీ ప్రభుత్వం రోజా సస్పెన్షన్ ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. రోజాను ఏడాది పటు సస్పెండ్ చేయడం ద్వారా, విపక్ష సభ్యులు ఎవరు దుడుకుగా ప్రవర్తించినా ప్రభుత్వ చర్యలు ఇలాగె ఉంటాయని వారు సంకేతం ఇవ్వదలచుకున్నారు. అయితే దీనిని హై కోర్ట్ కొట్టేయడం జరిగింది.
హై కోర్ట్ లో సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఇది. దీని తరవాత నాలుగు వారాలు ఆగి మళ్ళీ వాదనలు వింటామని న్యాయమూర్తి చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పర్యవసానంగా శాసనసభలో జరిగిన పరిణామాలు మరొక ఎత్తు. సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు స్పీకర్ కోడెల, సీఎం చంద్రబాబు లతో విడివిడిగా సమావేశం అయ్యారు. మరొక వైపు ఎమ్మెల్యే బొండం ఉమా మాట్లాడుతూ రోజా సస్పెన్షన్ అనేది సభ తీసుకున్న నిర్ణయం అని ప్రకటించారు. తీవ్రమైన మల్లగుల్లాల తరవాత అసెంబ్లీ కార్యదర్శి ద్వారా కోర్ట్ లో పిటిషన్ వేయించాలని నిర్ణయించారు. ఒకవైపు కోర్ట్ తీర్పును గౌరవిస్తున్నాం అని చెబుతూనే మరొక వైపు ‘అసలు శాసనసభ వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం న్యాయ వ్యవస్థకు లేదు’ అని కోర్టును నిలదీయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వారు ఆ పిటిషన్ వేస్తే గనుక ‘శాసన మరియు న్యాయ’ వ్యవస్థ ల మధ్య ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. సింగల్ జడ్జి తీర్పు మీద అప్పీల్ కు వెళ్ళడం అనేది ‘నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా’ అని చీమ ప్రశ్నించే సామెత లాగానే ఉన్నది. నా పని లో మీరు ఎలా వేలు పెడతారంటూ అసెంబ్లీ అప్పీల్ కు వెళితే, కోర్ట్ కూడా గుస్సా కావడం గ్యారంటీ. మొత్తానికి ఈ ప్రతిష్టంభన ఎలా మలుపులు తిరుగుతుందో చూడాలి.