తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాల సంబరం అంబరాన్నంటింది. కోట్ల మంది పుష్కర స్నానాలు చేసి పాప పరిహారం పొందామని సంతోషిస్తున్నారు. ముఖ్యమంత్రులకు మాత్రం దీని వల్ల పదవీ గండం అనే ఒక వాదన వినవస్తోంది. బెజవాడ గోపాలరెడ్డి నుంచి చంద్రబాబు వరకూ ఎంతో మంది పుష్కర స్నానం చేసిన తర్వాత సీఎం పదవి కోల్పోయారని కొందరు ఉదాహరణలు చూపిస్తున్నారు.
బెజవాడ గోపాల రెడ్డి 1955లో సీఎం హోదాలో పుష్కర స్నానం చేశారు. 1956లో పదవిని కోల్పోయారు. కాసు బ్రహ్మానంద రెడ్డి కూడా 1967లో పుష్కర స్నానం చేశారు. నాలుగేళ్ల తర్వాత పదవిని కోల్పోయారు. మర్రి చెన్నారెడ్డి 1979లో పుష్కర స్నానం ఆచరించారు. 1980లో పదవిని పోగొట్టుకున్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1991లో పుష్కరాల సందర్భంగా నదిలో మునిగారు. తర్వాతి ఏడాదే మాజీ ముఖ్యమంత్రిగా మారారు. నారా చంద్రబాబు నాయుడు 2003 పుష్కరాల్లో స్నానమాచరించారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయి మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. అయినా రాజకీయంగా నిలదొక్కుకుని, పదేళ్ల తర్వాత మళ్లీ సీఎం అయ్యారు.
నిజంగా పుష్కరాల్లో స్నానం చేస్తే పదవి పోతుందా? అలా జరగదంటున్నారు జ్యోతిషులు. పుష్కర స్నానానికీ పదవీ గండానికీ సంబంధం లేదంటున్నారు. పైన చెప్పిన వారికి రాజకీయ పరిస్థితులు, వారి గ్రహబలం కారణంగా పదవీ గండం వచ్చిందని అంటున్నారు. నిజానికి పుష్కర స్నానం వల్ల శని ప్రభావంపోయి గురు ప్రభావం మొదలైందని చెప్తున్నారు. కేసీఆర్, చంద్రబాబులకు ఇప్పుడు గురు మహర్దశ నడుస్తోందని, కాబట్టి పుష్కర స్నానం వల్ల పదవి పోతుందనే భయం అవసరం లేదని కొందరు పండితులు భరోసా ఇస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పదవుల విషయంలో కొన్ని వింత వాదనలు వినవస్తుంటాయి. ఫలానా గుడికి వెళ్లిన సీఎం పదవిని కోల్పోతారని చాలా చోట్ల ప్రచారంలో ఉంది. ఫలానా ఉత్సవాలకు హాజరైతే ఇక అదే చివరి సంవత్సరమని, పదవి పోవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. అలాగే పుష్కరాల విషయంలోనూ ఇలాంటి వదంతులే ప్రచారంలో ఉన్నాయి. దీన్నిబట్టి, ఇద్దరు ముఖ్యమంత్రులూ గురు మహర్దశతో తమ తమ రాష్ట్రాలను దివ్యంగా అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిద్దాం.