ఓటుకు నోటు వ్యవహారంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని కొన్ని రోజుల పాటు హడలిపోయిన తెలుగు దేశం నాయకులు, ఇప్పుడు దూకుడు పెంచారు. సైకిల్ గుర్తుపై గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ రాజీనామా చేయకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం ఎలా చేశారంటూ టీడీపీ మొదటినుంచీ ధ్వజమెత్తుతోంది. ఆయన్ని బర్తరఫ్ చేయాలని గవర్నర్ ను చాలా సార్లు కోరింది. చివరకు రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చింది.
ఇప్పుడు టీడీపీ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్టు కనిపిస్తోంది. మంగళవారం మరోసారి గవర్నర్ కు ఫిర్యాదు చేయడానికి రాజ్ భవన్ వెళ్లిన టీడీపీ నేతలు, అక్కడే ధర్నాకు దిగడం కలకలం రేపింది. గవర్నర్ నే టార్గెట్ చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. రెవంత్ రెడ్డికి బెయిల్ రావడం, చంద్రబాబుకు నోటీసు వ్యవహారంపై చడీ చప్పుడు లేకపోవడం వంటి కారణాలతో టీడీపీ స్వరం పెంచినట్టు కనిపిస్తోంది.
టీడీపీ రోజూ ఆందోళనలకు దిగితే అప్పుడు కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. ధిక్కారమున్ సైతునా అనేది కేసీఆర్ వైఖరి. నేను దయతలచి ఇస్తానే తప్ప డిమాండ్ చేయకూడదని ఇటీవల కొన్ని సమ్మెల విషయంలో ఆయన వైఖరి స్పష్టమైంది. అలాంటిది, టీడీపీ పదే పదే ఆందోళనలతో తనను విమర్శిస్తుంటే అది ప్రజాస్వామ్యంలో సాధారణం అని ఊరుకుంటారా లేక కఠినంగా వ్యవహరించాలని పోలీసులు ఆదేశిస్తారా అనేది చూడాలి. ఒకవేళ కేసీఆర్ కఠిన వైఖరి అవలంబిస్తే అప్పుడు టీడీపీ ఎలా ప్రతిస్పందిస్తుంది అనేది కీలకం.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ బలపడటానికి గట్టిప్రయత్నం చేస్తోంది. కాబట్టి తెరాస ప్రభుత్వం కఠిన వైఖరి పెరిగే కొద్దీ హైదరాబాద్ లో తమకు ప్రజల సానుభూతి పెరుగుతుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. సీమాంధ్ర ప్రజల్లో టీడీపీయేతరులను కూడా ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇటీవలి పరిణామాలతో ఈ ప్రయత్నాలు కొంత వరకు సఫలం అయ్యాయని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు టీడీపీ మీద తెరాస ప్రభుత్వం కరకు వైఖరి అవలంబిస్తే గనక గ్రేటర్ ఎన్నికల్లో తమకే లాభిస్తుందనే టీడీపీ లెక్కలు నిజమవుతాయా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.