వైకాపా ఎమ్మెల్యేలు చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి, ఆర్.కె.రోజా తదితరులు హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మాటలు విన్నపుడు అప్రయత్నంగానే మొన్న శాసనసభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను జ్ఞప్తికి తెస్తున్నాయి. మొదట రోజా మాట్లాడిన మాటల గురించి చెప్పుకొంటే, “నన్ను శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం వలన కీలకమయిన శాసనసభ బడ్జెట్ సమావేశాలలో నేను నా నియోజక వర్గ సమస్యల గురించి మాట్లాడలేకపోతున్నాను. దాని వలన నా హక్కులకు భంగం కలగిడమే కాక, నా నియోజక వర్గ ప్రజలకు కూడా అన్యాయం జరిగినట్లయిందని నేను హైకోర్టుకి విన్నవించుకొంటే, న్యాయస్థానం నా వాదనతో ఏకీభవించి నాపై విధించిన సస్పెన్షన్ పై స్టే విధించింది. ఆ తీర్పు న్యాయస్థానాల పట్ల నాకున్న గౌరవాన్ని రెట్టింపు చేసింది.”
“న్యాయస్థానం నాపై విధించిన సస్పెన్షన్ న్ని ఎత్తివేస్తూ తీర్పు ఇస్తే తెదేపా ప్రభుత్వం దానిని కూడా గౌరవించడానికి ఇష్టపడటం లేదు. నన్ను శాసనసభలొ అడుగు పెట్టనీయమని, మళ్ళీ ఈ తీర్పుపై అప్పీలు చేస్తామని చెపుతున్నట్లు తెలిసింది. జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానం బెయిలు మంజూరు చేసి జైలు నుంచి విడుదల చేస్తే తెదేపా నేతలందరూ ఆయన సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని బెయిలు సంపాదించుకొని బయటపడ్డారని ప్రచారం చేసారు. ఇప్పుడు నాకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తే దానిని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు అంటే తెదేపాకు న్యాయవ్యవస్థల పట్ల నమ్మకం, గౌరవం లేవని అర్ధమవుతోంది. కానీ నాకు, మా పార్టీకి న్యాయస్థానాల పట్ల అపారమయిన నమ్మకం, గౌరవం ఉన్నాయి. నేను రేపటి నుంచి శాసనసభ సమావేశాలకు హాజరవుతాను. ఒకవేళ వాళ్ళు నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేసినా లేదా వాళ్ళే హైకోర్టు తీర్పును న్యాయస్థానంలో సవాలు చేసిన నేను మళ్ళీ న్యాయపోరాటానికి సిద్దం,” అని అన్నారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి అన్న మాటలు చెప్పుకొంటే “చంద్రబాబు నాయుడు తనపై పడిన కేసులలో ‘వ్యవస్థలను'(?) మేనేజ్ చేసి తీర్పులు తనకు అనుకూలంగా తెప్పించుకొంటారు,” అని ఆరోపించారు. అంటే ఆయన న్యాయవ్యవస్థలని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే న్యాయమూర్తులని ‘మేనేజ్’ చేస్తుంటారని జగన్ ఆరోపిస్తున్నట్లు అర్ధమవుతోంది. అందుకు అధికార పార్టీ సభ్యులు అందరూ తీవ్రంగా నిరసన తెలిపారు. అది వేరే సంగతి. జగన్ చెప్పిన ఆ ఒక్క ముక్క న్యాయవ్యవస్థల పట్ల ఎంత చులకన భావం ఉందో తెలియజేస్తోంది. ఇదివరకు కూడా జగన్ కొన్ని సార్లు చంద్రబాబు నాయుడు కేసుల విషయం ప్రస్తావనకి వచ్చినప్పుడు ఇంచుమించు ఈవిధంగానే అన్నారు. అంటే మొన్న ఏదో పొరపాటున నోరు జారి అన్నమాట కాదని అదే ఆయన అభిప్రాయమని అర్ధమవుతోంది.
అయితే న్యాయవ్యవస్థల పట్ల ఏదో ఒక పార్టీ నేతలకి చాలా గౌరవం ఉందని మరొకరికి లేదని అనుకోనవసరం లేదు. రోజా విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని తాము గౌరవిస్తాము అని చెపుతూనే, న్యాయవ్యవస్థలు చట్ట సభల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి అధికారం లేదని, స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించదానికి అధికారం లేదని తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు చెప్పడం సాంకేతికంగా సరయినదే కావచ్చు కానీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని తాము ఆమోదించడానికి ఇష్టపడటం లేదని చెపుతున్నట్లుంది. మన రాజకీయ నాయకులలో అధికశాతం మందికి ప్రజల పట్ల, ప్రజాస్వామ్య, న్యాయవ్యవస్థల పట్ల చాలా చులకన భావం ఉందనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటలలో, చేతలలో కనిపిస్తూనే ఉంటుంది. కానీ పైకి మాత్రం అందరూ తమకి వాటి పట్ల చాలా గౌరవం ఉన్నట్లుగా చాలా గొప్పగా నటించేస్తుంటారు అంతే!