చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్ న్ని ఈనెల 28న వివాహం చేసుకోబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రతీ చిన్న విషయంలోను అనవసరమయిన గోప్యత పాటించే అలవాటున్న చిరంజీవి కుటుంబం ఆమె వివాహ విషయంలో కూడా చాలా గోప్యత పాటిస్తోంది. ఆ కారణంగా ప్రజలకి ఆ వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఇంకా పెరిగింది. కనుక మీడియాకి కూడా పని పడింది. అప్పటి నుంచి శ్రీజ వివాహం గురించి, వరుడు కళ్యాణ్ గురించి, అతను సినిమాలలో నటించబోతున్నాడంటూ రకరకాల స్పైసీ వార్తలను మీడియా వండి వార్చేసింది. ఇది వారి కుటుంబానికి చెందిన స్వంత వ్యవహారమే అయినప్పటికీ, దాని గురించి అనవసరమయిన గోప్యత పాటించడం వలననే అది ఇంకా బహిరంగం అయ్యిందని చెప్పక తప్పదు.
మీడియా ప్రతినిధుల ఆ స్వయంకృషి కారణంగానే క్రమంగా వారి వివాహం గురించి అన్ని వివరాలు ఒకటొకటిగా బయటపడ్డాయి. తాజాగా వారి వివాహ వేదిక గురించి వివరాలు బయటపడ్డాయి. బెంగూళూరులోని చిరంజీవి కుటుంబానికి ఉన్న ఒక ఫార్మ్ హౌస్ లో ఈనెల 28న శ్రీజ-కళ్యాణ్ ల వివాహం జరుగబోతోందని తెలిసింది. ఆ పెళ్ళికి కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరవుతారు. మార్చి 31వ తేదీన హైదరాబాద్ లో పార్క్ హయత్ హోటల్లో రిసెప్షన్ జరుగుతుంది. దానికి మాత్రం సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించినట్లు సమాచారం.