అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ఎప్పుడూ అందరి కంటే ముందుండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఐదు గ్రిడ్స్ లో ఒకటయిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకి ఈరోజు విశాఖలో ప్రారంభోత్సవం చేసారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం నెలకి రూ.150లకే ఇంటింటికీ టెలీఫోన్ సౌకర్యం, 15ఎం.బి.పి.ఎస్. వేగం కలిగిన ఇంటర్నెట్ కనెక్షన్ మరియు టీవీ ఛానల్స్ అందించబోతున్నారు. విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రంలో గల ఒక భవనంలో తాత్కాలికంగా దీని కోసం ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసారు.
ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే విశాఖ, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలో సుమారు 2661 కిమీ పొడవునా ఆప్టికల్ ఫబార్ కేబుళ్ళను వేశారు. వాటిని గృహాలకి అనుసంధానం చేసి ఈ మోఉ సౌకర్యాలు కల్పించబోతున్నారు. మారుమూల గ్రామలను సైతం ఇంటర్నెట్, ఫోన్ ల ద్వారా ప్రపంచంతో అనుసంధానం చేయాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టుని చేపట్టారు. తద్వారా మారుమూల గ్రామాలకు టెలి మెడిసిన్, దూర విద్య, రైతులకు వ్యవసాయ సూచనలు, తదితర సౌకర్యాలు కల్పించవచ్చును. టెలి, వీడియో కాన్ఫరెన్స్ విధానాలలో రాష్ట్ర ప్రభుత్వం మరియు వివిధ స్వచ్చంద సంస్థలు మారుమూల గ్రామాల ప్రజలతో సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే అవకాశం కలుగుతుంది.