ఇవాళ్టి రోజుల్లో కేంద్రప్రభుత్వాన్ని తమ కనుసన్నల్లో నడిపిస్తున్న కరడుగట్టిన హిందూ మతవాద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ అంటే.. ఎవ్వరికీ ఆశ్చర్యం కలుగదు. కేంద్రం తీసుకునే నిర్ణయాల విషయంలో వారి పాత్ర ఎక్కువగా ఉంటుందని ప్రతిపక్షాలు తరచుగా ఆరోపిస్తూ ఉంటాయి. సదరు ఆరెస్సెస్ మాత్రం కరడుగట్టిన మతవాదానికి చిహ్నం అన్నట్లుగా తన ప్రకటనలు చేస్తుంటుంది. హిందూ మతవాదం.. మతమౌఢ్యం రూపంలో తలకెక్కిన చందంగా ఆరెస్సెస్ నాయకులు కొందరు మాట్లాడే మాటలు ధ్వనిస్తూ ఉంటాయి. అలాంటిది.. సామాజికంగా పెడపోకడల్లో ఒకటిగా ఎక్కువమంది భావిస్తూ ఉండే.. హోమోసెక్స్ వ్యవహారానికి (స్వలింగ సంపర్కానికి) మాత్రం ఆరెస్సెస్ పచ్చజెండా ఊపుతున్నట్లే కనిపిస్తోంది. సాధారణంగా ఆరెస్సెస్ జై కొట్టిన ప్రతి దానికీ తాను కూడా జై కొడుతూ ఉండే ప్రధాని నరేంద్రమోడీ , ఈ స్వలింగ సంపర్కానికి కూడా జై కొడతారా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారుతోంది.
ఆరెస్సెస్ కీలక నాయకుల్లో ఒకరైన సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రభుత్వానికి తాము ఎలా టర్మ్స్ నిర్దేశిస్తుంటామో చెప్పుకొచ్చారు. తాము అదే తరహా సంకేతాలు కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా కూడా ఇస్తూనే ఉంటాం అని.. పాటించేవారు పాటిస్తారు.. లేనివారు లేదు .. అన్నట్లుగా సెలవిచ్చారు. ప్రభుత్వానికి ఎవ్వరైనా సలహాలు ఇవ్వవచ్చంటూ.. కేంద్రం స్టీరింగును తమ చేతుల్లో పెట్టుకునే వైనాన్ని ఆయన సమర్థించుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. స్వలింగసంపర్కుల గురించి ఆయన చేసిన కామెంట్లు మరొక ఎత్తు.
స్వలింగ సంపర్కం అనేది వ్యక్తిగత అంశం. సమాజంలో ఇతరుల జీవితాలను ప్రభావితం చేయనంత వరకు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదు అంటూ హోసబలే వ్యాఖ్యానించడం విశేషం. ఇలాంటివి పూర్తిగా వ్యక్తిగతమైనవని, వీటిని ఆరెస్సెస్ చర్చించదు అని ఆయన సెలవిచ్చారు. సంస్థ పూర్తి సమయం కార్యకర్తల పేరిట బ్రహ్మచారులు ఎక్కువమంది సేవలు అందిస్తూ ఉండే సంస్థ ఆరెస్సెస్.. హోమోసెక్స్ గురించి చర్చించదు అంటూనే.. ఆ వ్యవహారానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నట్లుగా దత్తాత్రేయ హోసబలే చెబుతున్న మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక వ్యవహారంపై మంచి- చెడు అని నిర్దిష్టంగా తేల్చిచెప్పకుండా.. ఇలా డొంకతిరుగుడుగా మాట్లాడాల్సిన అవసరం ఆరెస్సెస్‌కు ఏంటని పలు విమర్శలు కూడా వస్తున్నాయి.