వైకాపా ఎమ్మెల్యే రోజా కొద్దిసేపటి క్రితం ఏపి అసెంబ్లీకి చేరుకొన్నారు. ఆమెను సభలోనికి రానీయవద్దని స్పీకర్ కోడెల శివప్రసాద రావు అసెంబ్లీ మార్షల్స్ కి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆమెను శాసనసభలోని వైకాపా కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతించడంతో ఆమె తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అక్కడికి చేరుకొన్నారు.
జగన్మోహన్ రెడ్డి తనతో పాటు రోజా తరపున వాదించిన లాయర్ ని కూడా లోపలకి తీసుకువెళ్తానని పట్టుబట్టినప్పుడు మొదట పోలీసులు అందుకు అభ్యంతరం చెపారు. కానీ ఎవరినయినా తన పాస్ మీద లోపలకి తీసుకువెళ్ళే అధికారం తనకి ఉందని జగన్ వాదించడంతో, పోలీసులు అసెంబ్లీ కార్యదర్శిని సంప్రదించిన తరువాత అనుమతించారు.
రోజాని సభలోకి అనుమతించబోరనే విషయం తెలిసినందున జగన్మోహన్ రెడ్డితో సహా వైకాపా సభ్యులు అందరూ బయటే ఉన్నారు. కానీ లోపల యధాప్రకారం స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. రోజా సస్పెన్షన్ పై హైకోర్టు నుండి తీర్పు కాపీ ఇంకా స్పీకర్ కార్యాలయానికి అందలేదు కనుక అంతవరకు రోజాను సభలోకి అనుమతించకుండా ఉండేందుకు అవకాశం ఉంది. అది అందిన తరువాత దానిపై సభ అభిప్రాయం తెలుసుకొని తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో హైకోర్టు సింగిల్ జడ్జి నిన్నఇచ్చిన తీర్పుని హైకోర్టు బెంచి లో సవాలు చేయాలని నిశ్చయించుకొన్నట్లు తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు నిన్ననే చెప్పారు.