తెలంగాణా ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన తెలంగాణా రాజకీయ ఐ.కా.స. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత నుంచి క్రమంగా తన ఉనికిని కోల్పోతోంది. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలలో దానిని ఉపయోగించుకొన్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్, అధికారంలోకి వచ్చిన తరువాత దానిని పట్టించుకోకపోవ, దానిలో ఉద్యోగ సంఘాల నేతలు ఒకరొకరుగా తెరాస పార్టీలో చేరిపోయిన కారణాలుగానే ఐ.కా.స. కూడా ప్రతిపక్ష పార్టీల మాదిరిగానే క్రమంగా నిర్వీర్యమయిపోసాగింది. తెలంగాణా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఐ.కా.స.లో కొనసాగినట్లయితే తమకూ ప్రభుత్వం నుండి ఇబ్బందులు తప్పవనే భయంతో మరికొందరు దానిలోంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితులలో ఇంకా దానిని కొనసాగిస్తారా లేదా అనే సందేహం తలెత్తుతోంది.
రాజకీయ ఐ.కా.స. చైర్మన్ ప్రొఫెస్సర్ కొదండరాం మొన్న మీడియాతో మాట్లాడుతూ, “దీనిని తెలంగాణా సాధన కోసమే ఏర్పాటు చేసినప్పటికీ, హైకోర్టు విభజన వంటి కొన్ని లక్ష్యాలు ఇంకా కొన్ని మిగిలిపోయాయి కనుక ఎన్ని అవాంతరాలు ఎదురయినా దీనిని కొనసాగిస్తాము,” అని చెప్పారు.
తెలంగాణా సాధన కోసం పోరాడిన ఈ రాజకీయ ఐ.కా.స.ను తెరాస ప్రభుత్వం పట్టించుకోకపోయినప్పటికీ, దానికి తాము అండగా నిలుస్తామని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత జీవన్ రెడ్డి ప్రకటించారు. “ఉద్యోగులు, సాగునీటి పంపకాల సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. ఉమ్మడి హైకోర్టు విభజన ఇంకా జరుగలేదు. ఇవి కాక తెరాస ప్రభుత్వం ప్రకటించిన అనేక హామీలు అమలు కావలసి ఉంది. కనుక ఇటువంటి కీలక సమయంలో రాజకీయ ఐ.కా.స. తన బాధ్యతల నుంచి తప్పుకోవడం సమజంసం కాదు. దానికి మా పార్టీ పూర్తి సహాయసహకారాలు అందిస్తుంది,” అని జీవన్ రెడ్డి చెప్పారు.