వైకాపా ఎమ్మెల్యే రోజాని శాసనసభ సమావేశాలలో పాల్గొనేందుకు అనుమతించనందుకు నిరసనగా ఆ పార్టీ సభ్యులు అందరూ శాసనసభకు వెళ్ళకుండా బయట ధర్నా చేస్తున్నారు. వారు రానప్పటికీ శాసనసభ సమావేశాలు యదాతధంగా కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత సభలో బడ్జెట్ పై చర్చ మొదలుపెట్టారు. రోజా సస్పెన్షన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను సభలో సభ్యులు అందరికీ పంచబడ్డాయి. దీని గురించి సభలో శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులు సభకు రాకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. రోజాతో సహా ఎవరిపైనా మా ప్రభుత్వానికి కోపం లేదు. సభలో సభ్యులు అందరూ సభా మర్యాదలు పాటించమనే మేము కోరుతున్నాము. రోజా ఆ మర్యాదలను ఉల్లంఘించి వ్యవహరించినందుకే ఆమెను సస్పెండ్ చేయవలసి వచ్చింది. దానికి సభ ఆమోదం ఉంది. ఈ వ్యవహారంపై మళ్ళీ సభలో చర్చించి తగిన నిర్ణయం తీసుకొందాము,” అని చెప్పి బడ్జెట్ పై చర్చను మొదలుపెట్టారు.
బయట వైకాపా ఎమ్మెల్యేల ధర్నాలో రోజా మీడియాతో మాట్లాడుతూ “ఈ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థల పట్ల నమ్మకం, గౌరవం లేవని మరోసారి రుజువయింది. హైకోర్టు ఆదేశాలను కూడా అది ఖాతరు చేయడం లేదు. నేను దీనిపై మళ్ళీ న్యాయపోరాటం చేస్తాను. మాకు న్యాయవ్యవస్థల పట్ల అపార నమ్మకం గౌరవం ఉన్నాయి. నేను సభలో తెదేపా మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా వ్యవహరించానని ప్రచారం చేస్తూ ప్రజలకు నా పట్ల వ్యతిరేక భావన ఏర్పడేందుకు తెదేపా ప్రయత్నాలు చేస్తోంది. కానీ నా సంగతి రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. మహిళా సమస్యల కోసం నేను మొహానికి మేకప్ కూడా వేసుకోకుండా ఎండలో నిలబడి పోరాడిన రోజులు ఉన్నాయి. (ఇక్కడ ఆమె మొహానికి మేకప్ వేసుకోవడం గురించి ఎందుకు మాట్లాడారో?) అటువంటిది నేను సాటి మహిళా సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించానని తెదేపా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం భ్రమ. నేను సభలో ఎవరి పట్లయినా అనుచితంగా వ్యవహరించినట్లు రుజువులు ఉంటె చూపించమని ఎన్నిసార్లు అడిగినా ఎందుకు చూపించడం లేదు?” అని ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘రోజమ్మ న్యాయపోరాటానికి వైకాపా అండగా నిలబడుతుంది. ఆమెకు న్యాయం జరిగేవరకు పోరాడుతాము,” అని చెప్పారు.