ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ దేశ ప్రజలందరూ ‘భారత్ మాతాకి జై’ అనే నినాదాన్ని భావితరాలకు అందించాలని కోరడం, ఆ వెంటనే మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ‘నా పీక మీద కత్తి పెట్టి చెప్పమన్నా సరే నేను చెప్పను…ప్రాణం పోయినా కూడా,’ అని చెప్పడంతో మళ్ళీ మరో సరికొత్త వివాదం ప్రారంభించినట్లయింది. అన్ని పార్టీల రాజకీయ నాయకులు తమకు తోచిందేదో మాట్లాడుతూ దానిని కొనసాగిస్తున్నారు. దాని వలన దేశంలో హిందూ, ముస్లిం ప్రజల మధ్య మరింత దూరం పెరగడం తప్ప మరే ప్రయోజనం ఉండదని అందరికీ తెలుసు. అయినా తమ మతానికి చెందిన ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అందరూ తలో రాయి వేస్తున్నారు.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా దీని గురించి మాట్లాడుతూ “దేశానికి సెల్యూట్ చేయనివారు.. మరెవరికి సెల్యూట్ చేస్తారు?” అని ప్రశ్నించారు. ఒకప్పుడు రజాకార్లు ఈవిధంగా మాట్లాడేవారు. ఇప్పుడు ఆనాటి ఖాసీం రజ్వీని ఆదర్శంగా తీసుకొన్నవాళ్ళు మాత్రమే భారత్ పట్ల ఈ విధంగా వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అమ్మను, మాతృభూమిని, మాతృబాషని గౌరవించలేని వారు మనుషులే కారు. భారత్ మాతా కి జై అనే నినాదం ఏ మాతానికో సంబంధించినది కాదు. భారతీయులు అందరూ తల్లిగా భావించే దేశమాతని గౌరవిస్తూ పలికే నినాదం అది. దానికి కూడా ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో అర్ధం కావడం లేదు,” అని వెంకయ్య నాయుడు అన్నారు.
ఈ వాదోపవాదాల నేపధ్యంలో ఒకసారి జెఎన్.యు విద్యార్ధి కన్నయ్య కుమార్ అరెస్ట్ వ్యవహారం గురించి చెప్పుకోక తప్పదు. అతను నిజంగానే దేశ వ్యతిరేక నినాదాలు చేసాడో లేదో తెలియకపోయిన అతనిపై దేశద్రోహ నేరం మోపి అరెస్ట్ చేసారు. తను ఈ దేశం నుండి స్వేచ్చ కోరుకోలేదని, బలహీన వర్గాలను పీడన నుండి మాత్రామే స్వేచ్చ కోరుకొంటున్నానని మళ్ళీ మరోసారి స్పష్టం చేసాడు. అతను వామపక్ష భావజాల ప్రభావంలో ఉన్నాడని వెంకయ్య నాయుడే అన్నారు. అయినప్పటికీ అతనిపై పోలీసులు మళ్ళీ మరోసారి కేసు పెట్టేందుకు ప్రయత్నించి మళ్ళీ భంగపడ్డారు.
ఒక విద్యార్ధి పట్ల అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ప్రభుత్వం అసదుద్దీన్ ఒవైసీ, వారిస్ పఠాన్ వంటి ప్రజా ప్రతినిధులు భారత్ పట్ల తమకున్న వ్యతిరేకతను ఇంత బహిరంగంగా వ్యక్తం చేస్తున్నప్పటికీ వారిని ఏమీ చేయడం లేదు. అయితే ‘భారత్ మాతాకి జై’ అనే నినాదం చేయనంత మాత్రాన్న దేశభక్తి లేదనుకోనవసరం లేదు. చేసినవారందరూ అసలు సిసలయిన దేశభక్తులని అనేసుకోనవసరం లేదు. కానీ ఇటువంటి సందర్భాలలో ఓవైసీ వంటివారు మాట్లాడే మాటలలో దేశంపట్ల ఎంతో కొంత వ్యతిరేకత కనబడుతుంటుంది అందుకే వారిపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.
అయితే ముస్లిం ప్రజలను ఆకట్టుకోవడానికి ఓవైసీ వంటి నేతలు మాట్లాడే ఇటువంటి మాటల వలన, వారిలోనే తీవ్ర అభద్రతా భావం కల్పించినట్లవుతుందనే విషయం కూడా వారికి తెలియనుకోలేము. కానీ తెలిసి ఉన్నా ఆవిధంగా మాట్లాడుతున్నారంటే వారు కూడా ముస్లిం ప్రజలు అభద్రతా భావంలో ఉండాలన్నే కోరుకొంటున్నట్లుగా అనుమానించవలసి వస్తుంది. అప్పుడే తమ రాజకీయాలు సాగుతాయి. వాటికి ప్రజల మద్దతు కూడా కొనసాగుతోంటుందని వారు భావిస్తున్నారేమో?
అలాగే ఇటువంటి విషయాలపై భాజపా నేతలు ఎంత ఎక్కువగా మాట్లాడితే వారి గురించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను అంత బలపరుస్తున్నట్లవుతుందనే విషయం కూడా గ్రహించాల్సి ఉంది.