హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవ్వాళ్ళ కడప జిల్లాలోని కమలాపురంలో పర్యటిస్తున్నారు.జిల్లాకు చెందిన తెదేపా నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఆయనను కలిసేందుకు కమలాపురం తరలివచ్చేరు. తెదేపా నియోజకవర్గ ఇన్-చార్జ్ నర్సింహా రెడ్డి, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తదితర తెదేపా నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ కొత్తగా నిర్మించిన శ్రీకృష్ణ దేవాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లాలో ప్రసిద్ది చెందిన బండలాగుడు పోటీలను బాలకృష్ణ ప్రారంభించారు.
బాలకృష్ణ కడప జిల్లా పర్యటన ఆయన వ్యక్తిగత పర్యటనగానే పైకి కనిపిస్తున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డికి కంచుకోట వంటి కడప జిల్లాలో ప్రజలను తెదేపావైపు ఆకర్షించే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు నాయుడు ఆయనను కడపకి పంపించి ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపరుతున్నారు. వైకాపా కార్యకర్తలలో కూడా ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు కనుక, అటువంటి వారిని కూడా ఈ పర్యటన ద్వారా తెదేపా వైపు ఆకర్షించాలనే ఆలోచనతోనే బాలకృష్ణని పంపి ఉండవచ్చని భావిస్తున్నారు. కడప జిల్లాలో తెదేపాను బలోపేతం చేసుకోవడానికి కొన్ని రోజుల క్రితమే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రెండు రోజుల పాటు కడపలో పర్యటించిన సంగతి అందరికీ తెలిసిందే. కనుక ఇప్పుడు బాలకృష్ణ పర్యటన కూడా అందుకేనని అనుమానించకతప్పదు. ఒకవేళ ఆయన పర్యటనలో లేదా ఆ తరువాత గానీ వైకాపాకి చెందిన వారెవరయినా తెదేపాలో చేరినట్లయితే ఆ అనుమానాలే నిజమని నమ్మవచ్చును.