హైదరాబాద్: హైదరాబాద్‌వాసులకు ఉదయాన్నే లేవటం నేర్పింది ఎన్.టి.రామారావే అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తనను ఎన్ని అన్నా భరిస్తానని, అయితే తెలంగాణ సమాజాన్ని ఏమైనా అంటే సహించనని హెచ్చరించారు. ఇవాళ రవీంద్ర భారతిలో జరిగిన దాశరథి రంగాచార్య జన్మదిన వేడుకలలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ తెలంగాణపైన కొందరు అక్కసు వెళ్ళగక్కుతున్నారని అన్నారు. తెలంగాణపై వెకిలి మాటలు మాట్లాడితే ఎంతవరకైనా వెళ్తామని చెప్పారు. తెలంగాణను ఎవరు కించపరిచినా దాశరథిలాగా సమాధానం చెప్పాలని అన్నారు. ఏపీలో రాజధాని కట్టుకుని ప్రజలకు సేవ చేయాలిగానీ హైదరాబాద్ గురించి, తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడటమని అడిగారు. తెలంగాణను తన బతుకు బతకనివ్వాలని అన్నారు. ఆధునిక కవిత్వంలో సినారె సాటిరాగల కవులు ఆంధ్రప్రదేశ్‌లో లేరని చెప్పారు. తిరుమల శ్రీనివాసాచార్యకు దాశరథి స్మారక పురస్కారం అందిస్తూ, ఇది తన అదృష్టమని కేసీఆర్ అన్నారు. శ్రీనివాసాచార్యకు పాదాభివందనంచేశారు.