శాసనసభ సభ్యురాలు రోజా ఏడాది సస్పెన్షన్ మీద కోర్టు ఇచ్చిన ఉత్తర్వు పై శాసనసభే చర్చించి నిర్ణయం తీసుకుంటుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు వివరణ ఇచ్చారు. కోర్టు ఆర్డర్ ను సవాలు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచిలో ఆర్ధిక శాఖ కార్యదర్శి దాఖలు చేసిన పిటీషన్ సోమవారం నాడు విచారణకు వస్తుంది. సభకు హాజరు కావచ్చన్న హైకోర్టు స్టే ఆర్డర్ తో శాసనసభకు వెళ్ళిన రోజాను మార్షల్స్, పోలీసులు సభలోకి అనుమతించలేదు. సభనిర్ణయమే ఫైనల్ అంటూ రోజా సస్పెన్షన్ కోర్టు పరిధిలోకి రాదు అని సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.
ఆర్ధికశాఖ కార్యదర్శి పిటీషన్ వేయడంద్వారా శాసనసభ అధికారాల్లో కోర్టు జోక్యాన్ని రాష్ట్రప్రభుత్వం చాలెంజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. నిజానికి ఇది రాజకీయ నిర్ణయం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరిపాకే శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు మొత్తం కథ నడుపుతున్నారు. ఈ పరిణామాలన్నిటినీ విశ్లేషిస్తే సభకు వున్న హక్కులపై న్యాయస్ధానం జోక్యాన్ని అడ్డుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలుగుదేశం భావిస్తున్నట్టు స్పష్టమౌతోంది.
రాజ్యాంగ ధర్మసూక్ష్మంగా మారిన ఈ వివాదానికి ముగింపు ఏమిటన్నది కూతూహలమైన ప్రశ్నే!
శాసన నిర్మాణ శాఖ-లెజిస్లేచర్, న్యాయశాఖ-మధ్య అధికార పరిధికి సంబంధించిన వివాదాలు అపుడపుడూ తలెత్తుతూనే వున్నాయి. రోజాను సస్పెండు చేస్తూ గత సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానం సభా నిర్వహణ నియమాలకు విరుద్ధమన్నది హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు సారాంశం!
ఒక సభ్యుడిని, సభ్యురాలిని ఒక విడత సమావేశాల కాలపరిమితి ముగిసే వరకు సస్పెండ్ చేయవచ్చునన్నది నిబంధన. ఆ నిబంధన కింద ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి రోజాను సమావేశాలు ముగిసే వరకు మాత్రమే సస్పెండ్ చేసి ఉండినట్టయితే న్యాయస్థానం జోక్యం కలిగించుకొని ఉండేది కాదేమో! ఆమెను సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ శాసనసభ తీర్మానించింది! అందువల్ల సభా నియమావళికి భంగం కలిగిందన్నది హైకోర్టు చెప్పిన మాట! అందువల్ల రోజాను సస్పెండ్ చేసిన తరువాత ఆ సమావేశాలు ముగిసిపోయాయి. కనుక ప్రస్తుతం నడుస్తున్న సమావేశాలకు ఆ సస్పెన్షన్ వర్తించదు. హైకోర్టు ఇలా స్పష్టీకరణ ఇవ్వడం లెజిస్లేచర్ అంతరంగ వ్యవహారాలలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం రాజ్యాంగ బద్ధమా కాదా అన్నదే ఇప్పటి సరికొత్తవివాదం!
రాజ్యాంగంలోని 212వ ఆర్టికల్ ను ఉటంకిస్తున్న వారు న్యాయస్థానాలు అసెంబ్లీ వ్యవహారాలలో జోక్యం చేసుకొనడానికి వీలులేదని వాదిస్తున్నారు! అయితే 212వ ఆర్టికల్ గురించి గతంలో కూడ చర్చ జరిగింది. రాజ్యాంగంలోని 212వ ఆర్టికల్, 122వ ఆర్టికల్ కూడ లెజిస్లేచర్-శాసన నిర్మాణ శాఖ- అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదని నిర్దేశిస్తున్నాయి!
122వ ఆర్టికల్ పార్లమెంటు అంతర్గత వ్యవహారానికి సంబంధించినది కాగా, 212వ ఆర్టికల్ శాసనసభల కలాపాలకు చెందినది! విధానపరమైన అక్రమ పద్ధతులు చోటుచేసుకున్నప్పటికీ శాసనసభలో జరిగిన కార్యాకలాపాల సామంజస్యాన్ని న్యాయస్థానంలో సవాలు చేయడానికి వీలులేదని 212-ఎ-ఆర్టికల్ నిర్దేశిస్తోంది!
కాని సాధికారికంగా రాజ్యాంగ నియమాలను వ్యాఖ్యానించే బాధ్యత 143వ 147వ ఆర్టికల్స్ ప్రకారం ఇతర ఆర్టికల్స్ ప్రకారం సర్వోన్నత న్యాయస్థానానికి మాత్రమే ఉంది! అందువల్ల శాసన నిర్మాణ శాఖ-లెజిస్లేచర్-, కార్యానిర్వహణ శాఖ-మంత్రివర్గాలు-ఎక్జిక్యూటివ్-, న్యాయశాఖ-రాజ్యాంగ విభాగాలు ఒకరి అధికార పరిధిలోకి మరొకరు చొరబడినారా-అన్న సందేహాలు ఏర్పడినప్పుడు వాటిని నివృత్తి చేయగలిగింది సర్వోన్నత న్యాయస్థానం మాత్రమే!
ఈ సందేహాలు 2006లో లోక్సభ పదకొండు మంది సభ్యులను బహిష్కరించిన నాటినుంచి కొనసాగుతున్నాయి! రోజా శాసనసభలో మరో రాజకీయ పక్షానికి చెందిన మరో సభ్యురాలి గురించి అశ్లీల పదజాలంతో అసభ్యకరమైన వ్యక్తిగతమైన నిందా పూర్వకమైన వ్యాఖ్యలు చేయడం ఆమెను శాసనసభనుంచి బహిష్కరించడానికి కారణం! హైకోర్టు ఈ దుష్ప్రవర్తన గురించి ఇప్పుడు నిర్ణయించలేదు. సభా నిబంధనను ఉల్లంఘించిన రీతిలో శాసనసభ తీర్మానం జరగడం చెల్లదని మాత్రమే హైకోర్టు నిర్ధారించింది! అందువల్ల సభలో రోజా చేసిన అసభ్యకర ప్రసంగాన్ని హైకోర్టు ఆమోదించినట్టు కాలేదు.
ఆ ప్రసంగంలోని ఉచితానుచితాలు ఈ తీర్పు పరిధిలో లేవు! ఆమెను నిబంధన ప్రకారం ఒక విడత సమావేశాల పరిమితికి లోబడి బహిష్కరించి ఉండినట్టయితే బహుశా హైకోర్టు తీర్పు వేరే విధంగా ఉండేది!
అందువల్ల అప్పీలు దాఖలయ్యే వరకు హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పును శాసనసభలో అమలు చేయడం తప్పదు… సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం మేరకు మాత్రమే రోజా సస్పెన్షన్ వివాదాన్ని విచారించి హైకోర్టు తీర్పు చెప్పిందన్నది స్పష్టం! ఇలా విచారించడం తమ అంతర్గత అధికార పరిధిలోకి న్యాయస్థానం చొరబడినట్టు ఆంధ్రప్రదేశ్ శాసనసభ వారు భావిస్తే అసలు విచారణ జరుపరాదని ముందే పిటీషన్ వేయాలి! రోజా పిటిషన్ను విచారణకు స్వీకరించరాదని కోరి ఉండాలి! కానీ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ తరఫున ఇప్పుడు వాదన వినపడలేదు! హైకోర్టు మధ్యంతర తీర్పు వెలువడిన తరువాత కూడ శాసనసభ తరఫున ఆధికారికంగా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు!
న్యాయస్థానాల ప్రమేయాన్ని నిరోధించడం వల్ల రాజకీయ అక్రమాలకు భవిష్యత్తులో అవకాశం ఏర్పడుతుంది! మెజారిటీ పార్టీవారు మొత్తం మైనారిటీ పార్టీల సభ్యులను సభలనుండి బహిష్కరించినట్టయితే ఆ అన్యాయాన్ని అడ్డుకునేది ఎవరు? న్యాయాన్యాలను విచారించేది ఎవరు?