సమైక్య రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి చెందిన ఆస్తులు హైదరాబాద్ లోనే ఉన్నందున అవన్నీ తెలంగాణా రాష్ట్రానికే చెందుతాయని హైకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చింది. దానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేయగా, సుప్రీం కోర్టు ఈరోజు దానిపై తన తీర్పు వెలువరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. విభజన చట్టంలోని సెక్షన్:47 ప్రకారం ఉన్నత విద్యామండలికి చెందిన ఆస్తులను ఆంద్రా, తెలంగాణా రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన 52:48 నిష్పత్తిలో పంచుకోవాలని ఆదేశించింది. విభజన చట్టంలోని సెక్షన్: 75 అనేది కేవలం సేవలకే పరిమితం తప్ప ఆస్తులకు కాదని తెలంగాణా ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ సమస్యను రెండు నెలలలోగా పరిష్కరించాలని కేంద్రప్రభుత్వానికి గడువు విధించింది. పదో షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపకాల విషయంలో కూడా ఇటువంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ న్యాయవాది సుప్రీం కోర్టు చెప్పగా ఆ సంస్థల ఆస్తుల పంపకాలకు కూడా ఇదే తీర్పు వర్తిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.