వైకాపా ఎమ్మెల్యే రోజాని ఈరోజు శాసనసభలోకి అనుమతిస్తారా లేదా? అనే సస్పెన్స్ ఎపిసోడ్ పూర్తయిపోయిన తరువాత వైకాపా సభ్యులు అందరూ గవర్నర్ దగ్గరకు వెళితే, తెదేపా ప్రభుత్వం కోర్టుకి వెళ్ళింది. హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పును అది డివిజన్ బెంచ్ లో సవాలు చేసింది. దానిపై వెంటనే విచారణ చేపట్టి, తీర్పు చెప్పాలని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వాదించినప్పటికీ, కోర్టు ఆ కేసును సోమవారానికి వాయిదా వేసింది.
ఆమెను శాసనసభలోకి అనుమతించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఈరోజు శాసనసభలో సభ్యులు అందరికీ పంచిన తరువాత, దానిపై సభ చర్చించి సోమవారం తగిన నిర్ణయం తీసుకొంటుందని స్పీకర్ కోడెల శివప్రసాద రావు ప్రకటించారు.
ఈ హడావుడి పూర్తయిన తరువాత లోటస్ పాండ్ లోగల వైకాపా ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యి ఈరోజు జరిగిన పరిణామాలపై చర్చించారు. రోజా విషయంలో మళ్ళీ న్యాయపోరాటానికి వెళ్ళాలా లేక ప్రత్యామ్నాయ పద్దతులలో ప్రభుత్వంపైఒ ఒత్తిడి చేయాలా అనే విషయంపై సోమవారం హైకోర్టు తీర్పు విన్న తరువాత తగిన నిర్ణయం తీసుకొందామని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. రోజా విషయంలో తెదేపా ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైకాపా శాసనసభ సభ్యులందరూ రేపు నల్ల దుస్తులు ధరించి శాసనసభకు హాజరవ్వాలని నిర్ణయించారు. మళ్ళీ రేపు కూడా రోజా శాసనసభ సమావేశాలలో పాల్గొనేందుకు వస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన చెప్పారు. సోమవారంనాడే హైకోర్టు బెంచ్ తన తీర్పు చెపుతుంది. అదే రోజు శాసనసభ ఈ వ్యవహారంపై నిర్ణయం ప్రకటిస్తుంది. అదే రోజు వైకాపా కూడా తన తదుపరి కార్యాచరణని ప్రకటిస్తుంది. అంటే సోమవారం మళ్ళీ మరో జబర్దస్త్ పొలిటికల్ షో ఉందని అర్ధమవుతోంది. మరి ఈ షో ఎలాగుంటుందో చూడాలి.