హైదరాబాద్: తెలంగాణకు హైకోర్టు ఏర్పాటుకోసం టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ పార్లమెంట్లో నిరసనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధి విగ్రహంవద్ద ప్లకార్డులు పట్టుకుని హైకోర్టు ఏర్పాటుపై నినాదాలు చేశారు. నిజామాబాద్ ఎంపీ కవిత మీడియాతో మాట్లాడుతూ, కొత్త రాష్ట్రం ఏర్పడిన వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయటం సర్వ సాధారణమని, అయితే తెలంగాణకు హైకోర్టు ఇంతవరకు ఏర్పడలేదని అన్నారు. దీనికి కారణం నరేంద్రమోడి ప్రభుత్వంలోని కొందరు సీనియర్ మంత్రులు అడ్డుపడటమేనని ఆరోపించారు. ప్రధాని మోడి జోక్యం చేసుకుని తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైకోర్టు విభజనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం కదిలేవరకు పార్లమెంట్లో తమ ఆందోళనను కొనసాగిస్తామని, పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీలు వినోద్, జితేందర్ రెడ్డి, బూర నర్సయ్యగౌడ్ తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరు గతవారం హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్కుకూడా ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు.