రాజమండ్రి: వీలైనంత త్వరగా ప్రభుత్వ శాఖలన్నీ విజయవాడకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. రాజమండ్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం బుధవారం జరిగింది. ప్రధాని సూచనల మేరకు చిన్న దేశాల్లో ఉన్న అత్యద్భుతమైన రాజధానులను పరిశీలించాలని, కజకిస్థాన్, తుర్క్ మెనిస్థాన్, ఆస్కాన్, అస్నాబాద్ రాజధానుల పరిశీలించాలని కేబినెట్ నిర్ణయించింది. 2018 నాటికి అమరావతి తొలిదశ పూర్తిచేయాలని తీర్మానించింది.
కేబినెట్ సబ్ కమిటీ వేసి రెవెన్యూ విధానాన్ని ఏడాది లోగా మార్చాలని నిర్ణయించారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇలా ఉన్నాయి…
కర్నూలు డీఆర్ డీవోకు 2వేల ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం
విశాఖ ఐటీ సెజ్ లో ఈ-సెంట్రిక్ సొల్యూషన్స్ సంస్థకు 300 ఎకరాల కేటాయింపు
పుష్కరాల అనంతరం ఈనెల 25వ తేదీన ప్రతి ఇంట్లో దీపారాధన చేయాలని పిలుపు
పుష్కరాల్లో పనిచేసిన ఉద్యోగులకు సన్మానాలు చేయాలని నిర్ణయం
రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజిలో పాల్గొనాలని చైనా, జపాన్, సింగపూర్, మలేసియా దేశాలకు లేఖలు రాయాలని నిర్ణయం
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి ఘటన విషయంలో కృష్ణా జిల్లా ముసునూరు తహసిల్దార్ వనజాక్షిదే తప్పని తేల్చింది. ఆమె తన సరిహద్దు దాటి పశ్చిమగోదావరి జిల్లాలోకి వెళ్లారని కేబినెట్ అభిప్రాయపడింది.
రాజమండ్రిలోని అర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మద్యాహ్నం రెండుగంటలవరకూ నాలుగంటల పాటు జరిగిన ఈ సమావేశానికి ఇద్దరు ఉపముఖ్య మంత్రులలో ఒకరైన కెఇ కృష్ణమూర్తి మినహా అందరూ హాజరయారు. మోకాలికి సర్జరీ చేయించుకున్నందువల్ల రాలేనని ముందుగానే ఆయన ముఖ్యమంత్రి అనుమతి తీసుకున్నారు.