గతంతో పోలిస్తే వ్యూహం మార్చుకుని సభలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్టు చెప్పిన వైసీపీ ఆచరణలో మళ్లీ ఘర్షణకే మొగ్గుచూపుతున్నది. రోజా సస్పెన్షన్ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వును ఆధారం చేసుకుని పోరాడవచ్చు గాని ఆ క్రమంలో అధికార పక్షం వ్యూహంలో చిక్కుకుపోతున్నదా అని సందేహం కలుగుతుంది. ఎందుకంటే పదేపదే సభ వాయిదా పడటం స్తంభించిపోవడం ఎప్పుడూ అధికార పక్షానికే లాభం తప్ప ప్రతిపక్షానికి కాదు. ప్రస్తుత సభల కాలం సగం ముగిసిపోతున్నా ఇంతవరకూ అర్థవంతమైన చర్చ జరిగే పరిస్థితి రాకపోవడం ఆందోళన కరం. ఇందులో మరో తమాషా ఏమంటే శాసనసభలో ఇంతగా నల్లచొక్కాలువేసుకుని నిరసన తెల్పుతున్న వైసీపీ వారు మండలిలో మామూలుగానే వుండటం. మీకు నిరసన లేదా అని తెలుగుదేశం సభ్యులు వారిని అపహాస్యం చేశారు.అధికార పక్షం మొండి తనం మాని పట్టువిడుపులు ప్రదర్శిస్తే సమస్య వుండదు గాని ఆ అవకాశమే లేదు. కనుక వైసీపీ రోజాకు న్యాయం జరగాలని పోరాడుతూనే సభలో ప్రతిష్టంభన వల్ల కలిగే నష్టాన్ని గుర్తించాల్సి వుంటుంది.ఉద్రిక్తత వచ్చాక తమ వారి మాటలు చేతలపై ఇరు పక్షాలకూ పెద్ద అదుపు వుండటం లేదు. అసలు ఉద్దేశపూర్వకంగానే ఇలా దారి తప్పిస్తున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
చట్టసభల ప్రతిపత్తి, స్పీకర్ నిర్ణయాధికారం విషయంలో కోర్టులు తలదూర్చడానికి లేదనేది ఎంత నిజమో వాటికి ఆ అవకాశం ఇవ్వకుండా ముందే సముచితంగా సమతుల్యతతో స్పీకర్లు వ్యవహరించాలన్నది అంతే నిజం. ఏదైనా సమస్య వచ్చినప్పుడైనా కోర్టులు చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకుని మళ్లీ సభ పరిధిలోనే పునరాలోచన చేసి పరిష్కరించుకోవడం ఉత్తమ మార్గం.ప్రజాస్వామిక పద్ధతి. సభ్యుల హక్కులను కాపాడ్డం ముఖ్యంగా ప్రతిపక్షానికి గల హక్కులకు అండగా నిలవడం స్పీకర్లపై గల ఒక ముఖ్య బాధ్యత. అనుభవజ్ఞుడైన కోడెల శివ ప్రసాదరావు, అంతకుముందే అనుభవం గడించిన సభా వ్యవహారాల మంత్రి యనమల ఈ సమస్యను ప్రజాస్వాకంగా రాజ్యాంగ స్పూర్తితో ఎలా పరిష్కరిస్తారు, ప్రతిపక్ష నేత వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరిస్తారు అన్నది చూడాల్సిందే.