ఎమ్మెల్యే రోజా వైఖరి రోజు రోజుకు పీటముడి లాగా బిగుసుకు పోతున్నట్లున్నది. ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి కూడా ఆమె డుమ్మా కొట్టడం, దానికి అనారోగ్యం పేరిట సాకులు చెప్పడం, ఇలాంటి చర్యలన్నీ కూడా మరింత ప్రతిష్టంభన కు దారి తీసేలా ఉన్నాయే తప్ప.. సమస్య ను సామరస్య వాతావరణంలో ఒక కొలిక్కి తెచ్చేందుకు ఉపయోగపడేలా లేవు. పైగా సొంత పార్టీలోనే నలుగురు ఎమ్మెల్యేలు జరిగిన పరిణామాలకు సంబంధించి సారీ చెప్పేసిన తర్వాత కూడా రోజా ఇంకా సాకులు చెప్పుకుంటూ రోజులు వెళ్లదీయాలనుకుంటే.. ముందు ముందు మరింత ఇబ్బందులు తప్పవని పలువురు అంచనా వేస్తున్నారు. శనివారం సమావేశానికి వచ్చి వివరణ ఇచుకోవాల్సిందిగా పిలిస్తే… రోజా అనారోగ్యం అనే సాకు చెప్పారనే అనుకుందాం… మరి గతంలో మూడు సమావేశాలకు కూడా ఎగ్గొట్టినందుకు ఎలాంటి సంజాయిషీ ఇచుకుంటారు. అందుకే… రోజా తల ఎగరేస్తున్న కొద్ది, ప్రభుత్వంతో సున్నం పెట్టుకోవడమే తన ఎజెండా గ ప్రొసీడ్ అయినంత వరకు ఆమెకు ఇబ్బందులు తప్పవని పలువురు అంటున్నారు.
వైసీపీ లొనే సభలో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణల మీద అయిదుగురు ఎమ్మెల్యేలను ప్రివిలేజ్ కమిటీ ముందుకు పిలిస్తే… నలుగురు కమిటీ ఎదుట క్షమాపణలు చెప్పారు. రోజా ఒక్కటే కమిటీ ని ఎవాయిడ్ చేస్తున్నట్లుగా ఈ పరిణామాలు ఒక అభిప్రాయం కలిగిస్తున్నాయి. సొంత పార్టీ లోనే రోజాపై సహచర ఎమ్మెల్యేల మద్దతు లేకుండా పోయిందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. వైసీపీ లొనే నలుగురు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని కూడా ప్రివిలేజ్ కమిటీ ముందు క్షమాపణలు చెప్పేశారు. అయితే రోజా మాత్రం కనీసం హాజరు కూడా కాలేదు. ఆమె మీద ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అనిత మాత్రం కమిటీ ముందుకు వచ్చి తన ఫిర్యాదు ను మళ్లీ నివేదించుకున్నారు. ఇంతా బయటా కూడా అవమానాలు మాత్రమే ఎదురయ్యేలా రోజా తనను అవమానించారని ఆమె చెప్పుకున్నారు. రోజా సభలో తనను అవమానించింది గనుక… అదే సభలో తనకు క్షమాపణ చెబితే సరిపోతుందని ఆమె కోరుతున్నారు. అయితే కమిటీ ముందుకు రావడాన్నే అవొయిడ్ చేస్తున్న రోజా.. సభలో ఆమెకు సారీ చెప్పేంత సహృదయత తో ఉంటుందని అనుకోవడం భ్రమ. అందుకే… రోజా వ్యవహారం… ఆమె తల ఎగరేస్తున్న కొద్దీ మరింతగా ముదిరిపోనున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.