సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “నాకు అన్నయ్య మీద ఉన్న ప్రేమాభిమానాలు ఎప్పటికీ చెక్కుచెదరవు. ఆ సంగతి మా ఇద్దరికీ తెలుసు. కనుక అన్నయ్య మీద ప్రేమాభిమానాలున్నాయని నేను పదేపదే రుజువు చేసుకోవలసిన అవసరం లేదని భావిస్తున్నాను. అన్నయ్య, వదిన ఇద్దరూ నాకు తల్లి తండ్రులతో సమానం. వారి కారణంగానే నేను ఈరోజు ఈ స్థాయికి ఎదగగలిగాను. ఒకప్పుడు నేను ఏ పని చేయకుండా తిరుగుతుంటే, నన్ను ప్రోత్సహించి ఈ సినీ పరిశ్రమలోకి తీసుకువచ్చింది మా అన్నయ్య వదినలే. ఒక మామూలు పోలీస్ కానిస్టేబుల్ కొడుకు అయిన అన్నయ్యకి సినీ పరిశ్రమలో ఎవరి అండదండలు లేకపోయినా ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకొన్నారు. ఆయన ఏర్పరచుకొన్న ఆ బాటలో నేను పెద్దగా కష్టపడకుండానే సినీ పరిశ్రమలోకి వచ్చేయగలిగాను. దానికీ ఆయన ప్రోత్సాహం చాలా ఉంది. ఒకప్పుడు నలుగురిలోకి రావడానికే సిగ్గుపడేవాడిని ఇప్పుడు ఇలాగ మీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే అందుకు కారణం మా అన్నయ్య ప్రోత్సాహమే. కనుక అన్నయ్య, వదినలకు నేను నా జీవితాంతమూ రుణపడే ఉంటాను. రాజకీయాలు వేరు కుటుంబ సంబందాలు వేరు. కనుక రెంటినీ ముడిపెట్టి చూడటం అనవసరం. మేమిద్దరం మాకు నచ్చిన మార్గాలలో నడుస్తున్నాము,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.