తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలను తెరాస ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణా రాజకీయ జేయేసి నుంచి కూడా ఉద్యోగ సంఘాల నేతలు ఒకరొకరుగా బయటకు వెళ్లిపోతుండటంతో, దానిని కూడా తెరాస ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడుతూ, జేయేసిలో ఎవరున్నా లేకపోయినా తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేసారు. అయితే తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎటువంటి విభేదాలు లేవని చెప్పడం విశేషం. కేసీఆర్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంటే తాను వాటిని ఆయన దృష్టికి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నాని చెప్పారు. ఇద్దరి దారులు వేరయినా లక్ష్యం మాత్రం ఒక్కటేనని చెప్పారు. తనకు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేదని మరోమారు చెప్పారు. అన్నాడిఎంకె హజారే వంటి సామాజిక సేవకులు రాజకీయాలకు దూరంగా ఉంటూ ఏవిధంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారో, తాను కూడా అదేవిధంగా పోరాడాలనుకొంటున్నట్లు ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు.