తెలంగాణా తెదేపాలో సీనియర్ నేత, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడుగా పేరున్న రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా త్వరలో తెదేపాకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరేందుకు సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. ఆయనకి తెరాస ఎమ్మెల్సీ సీటుని ఆఫర్ చేసిందని, కానీ మాజీ రాజ్యసభ సభ్యుడయిన తనకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు అంగీకరించినట్లయితేనే తెరాసలో చేరుతానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెరాస పెద్దలతో ఆయన చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన తెదేపాలోనే కొనసాగాలనుకొంటునప్పటికీ, తెలంగాణాలో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతుండటం, మళ్ళీ కోలుకొనే అవకాశాలు కనిపించకపోవడం, అయినా కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీని పట్టించుకోకపోవడం చేతనే అనేకమంది ఇతర నేతల్లాగే ఆయన కూడా విధిలేని పరిస్థితులోనే పార్టీని వీడేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే అయన డిమాండ్ కి తెరాస ఒప్పుకొంటుందో లేదా తెలియాల్సి ఉంది. ఎందుకంటే, ప్రతిపక్ష పార్టీల నేతలను తెరాసలోకి ఆకర్షించడానికి వారు కోరిన పదవులు కట్టబెడుతున్నందుకు ఇప్పటికే తెరాస నేతలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. తెలంగాణాలో తమ పార్టీ చాలా బలంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఇంకా బలపడేందుకు బయట నుంచి కొత్తగా పార్టీలోకి వస్తున్న వారికి ఈ విధంగా అన్ని ముఖ్యమయిన పదవులు పంచేస్తుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కనుక చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ కి తెరాస అధినేత అంగీకరిస్తారో లేదో చూడాలి.