వైసీపీ ఎంఎల్ఎ ఆర్కెరోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసే దిశలో ఎపి ఆసెంబ్లీ చర్చ నడుస్తున్నది. సభా హక్కుల సంఘం నివేదికను ప్రవేశపెట్టి దానిపై గౌతు శ్యామసుందర శివాజీ, బోండా ఉమామహేశ్వరరావు, అనిత తదితరులు మాట్లాడుతూ రోజా ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. ఆమెకు ఏడాది పాటు శిక్ష విధించినా తక్కువేనని కూడా వాదించారు. ఆనవాయితీ ప్రకారం ఇప్పటివరకూ చట్టసభలకూ న్యాయస్థానాలకూ మద్యన ఘర్షణ తలెత్తిన సందర్భాలపై తెలుగుదేశం సభ్యులు చాలా పమాచారం సేకరించారు. నిజానికి ఈ రోజు ఉదయం టీవీ చర్చకు వచ్చిన వారి మాటల్లోనే ఈ ఉదాహరణలు ఉదంతాలన్నీ ఏకరువుపెట్టడం కనిపించింది. జనతా ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని సభనుంచి బహిష్కరించిన ఏడాది తర్వాత మళ్లీ తీసుకున్న ఉదాహరణను కూడా వారు పేర్కొన్నారు. రోజా డిసెంబర్ 18న అనితను దుర్భాషలాడిన తీరు అవమానకరమన్నదే వారి వాదనలన్నిటిలోనూ ప్రధానంగా వినిపించిన విషయం. అయితే అదే సమయంలో తమ సభ్యులు మంత్రులు కూడా అనేక సందర్బాల్లో హద్దుమీరి మాట్లాడిన విషయాన్ని వారు ప్రస్తావించలేదు. న్యాయస్థానాల ఉత్తర్వులను ఎప్పుడూ చట్టసభలు ఆమోదించబోవన్నది తెలిసిన విషయమే. కాకుంటే సభ మరి వారం రోజుల్లో ముగిసిపోతున్నందున అప్పటి వరకూ రోజాను అనుమతిస్తే చాలా సమయం శ్రమ తప్పి వుండేవన్నది చాలా మంది అభిప్రాయంగా వుంది. ఇంత హడావుడి వల్ల రోజా పెద్దస్టార్గా మారిందనే అసంతృప్తి కూడా టిడిపి వారిలో కనిపిస్తున్నది. అయితే రోజాను సభలోకి రానిచ్టేట్టయితే ఇకముందు తీసుకునే చర్యలకు కూడా విలువ లేకుండా పోతుందని పాలకపక్షం వారు వాదిస్తున్నారు. ఈ లోగా హైకోర్టు విచారణ వెనువెంటనే ముగిసే సూచనలు లేకపోవడంతో సాయింత్రం వరకూ కొనసాగుతుంది. ఈ లోగా సభలో హక్కుల సంఘం తీర్మానాన్ని ఆమోదించి రోజాకు శిక్ష ప్రకటించేస్తారు గనక కథ సమాప్తమవుతుంది. గతానుభవాల రీత్యా హైకోర్టు ఏకపక్షంగా ఆదేశాలిచ్చే అవకాశముండదు. కోర్టు ఎత్తిచూపిన లోపాలు సభా సంఘం నివేదిక ఆమోదంతో సరిచేయబడుతుంది గనక కేసు విచారణ కూడా ప్రస్తుత పరిణామాలపై ఎలాటి ప్రభావం చూపదని చెప్పొచ్చు. వైసీపీ సభ్యులు ఈ రోజు మొత్తంగా సమావేశాలను బహిష్కరించడంతో వారి స్పందనలు అసలే తెలియరాలేదు. ఏది ఏమైనా పార్టీ మొత్తంగా రోజాను భుజాన వేసుకుని అదొక్కటే సమస్య అయినట్టు వ్యవహరించడం సరి కాదని కొందరు భావిస్తున్నారు. హక్కుల సంఘం నాలుగు సార్లు పిలిచినా రోజా హాజరు కాకపోవడంపై ఎలాటి సమాధానం లభించడం లేదు. మొత్తంపైన మరి కాస్సేపట్లో రోజాపై వేటు అనివార్యమే. ఒకసారి సభ హక్కుల సంఘం నివేదికను చర్చించి సరైన నిబంధనల ప్రకారం సస్పెన్షన్కు నిర్ణయం ప్రకటించితే ఇక కోర్టు విచారణ ఇన్ఫ్రాక్చస్ అయిపోతుంది. . ఏది ఎలా జరిగినా కోర్టు చెప్పిన ప్రకారం ఒక చట్టసభ అమలు చేసిన అనుభవం దేశంలోనే లేదు.కనుక దానివల్ల భవిష్యత్తుకు పాఠాలు లభించడం తప్ప రోజాకు నిర్దిష్టంగా ఎలాటి ప్రయోజనం వుండదని చెప్పొచ్చు