మాట తప్పేది లేదు.. మడమ తిప్పేదిలేదు… అని వైఎస్ జగన్ ఇప్పటికి కొన్ని వందల సార్లు ప్రకటించి ఉంటారు. సందర్భాలు వేర్వేరు అయి ఉండొచ్చు. కానీ.. తన నిర్ణయాల మీద తనకే సందేహం కలిగినప్పుడు, తన నిర్ణయం తనకు తప్పకుండా చేటు తెస్తుందని భయం కలిగినప్పుడు నిర్ణయం ప్రకటించిన తర్వాత.. ఆ సంగతి బోధపడితే.. మడమ తిప్పకుండా ఆయన మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు అదే జరుగుతోంది. ఆయన నిర్ణయాలు తీసేసుకున్న తర్వాత.. అందులోని పొరబాట్లు తెలుసుకుంటున్నారు. వెనుకడుగులు వేస్తున్నారు. కానీ నాయకుడుగా ఉన్న జగన్.. వరుస నిర్ణయాలలో వెనుకడుగు వేస్తూనే ఉంటే.. అది అనుచరులకు గానీ, ప్రజలకు గానీ ఎలాంటి సంకేతాలు పంపుతుంది? అది ఆయన సమీక్షించుకోవాలి.
ఒక నిర్ణయం తమ పార్టీనుంచి బయటకు వచ్చే ముందు.. దాని పర్యవసానాల గురించి కూడా కూలంకషంగా సమీక్షించుకున్న తర్వాతనే ఆ పని జరగాలి. పార్టీ నిర్ణయం బయటకు వచ్చేసిన తర్వాత.. వెనక్కు తగ్గుతూ ఉంటే పరువు పోతుంది. అలాంటివే జగన్ గత రెండు రోజుల్లో వరుసగా కొన్ని తప్పులు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
రోజా ఎపిసోడ్ హాట్‌హాట్‌గా నడుస్తున్న సంగతి తెలిసిందే. రోజా తన సస్పెన్షన్ మీద స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నా ఆమెను సభలోకి అనుమతించకుండా ఉన్న తీరుమీద కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయబోతున్నట్లుగా వైకాపా నాయకులు ప్రకటించారు. రోజా విషయంలో అసెంబ్లీ కార్యదర్శికి, రోజాను అడ్డుకునే రూపేణా తమ విధులు నిర్వర్తించిన మార్షల్స్‌కు జైలు శిక్ష తప్పకపోవచ్చుననే స్థాయిలో వారి కోర్టు ధిక్కరణ ఆలోచన గురించి ప్రచారం కూడా కల్పించుకున్నారు.
అలాగే.. రోజాను తిరిగి సభలోకి అనుమతించే వరకు వైకాపా సభ్యులు ఎవ్వరూ సభకు రాబోయేది లేదని కూడా వైకాపా వారు ప్రకటించారు. తద్వారా రోజా వెంట పార్టీ మొత్తం సంఘటితంగా ఉండి, ఆమెకు మద్దతుగా ప్రభుత్వంతో పోరాడదలచుకున్నదనే సంకేతాలు పంపారు. అయితే… ఈ ప్రకటనలన్నీ డొల్లేనని తేలిపోయాయి. వైకాపా తరఫున ఎవ్వరూ కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా వేయలేదు. ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లినందున, తాము పిటిషన్ వేసినా కూడా.. అప్పీల్ విచారణలో ఉన్నది కదా అనే చర్చ వస్తుందనే ఉద్దేశంతో వెనక్కు తగ్గినట్లు సాకులు చెప్పుకుంటున్నారు. అలాగే సభకు గైర్హాజరు కావాలనే నిర్ణయం కూడా తేలిపోయినట్లుంది. మంగళవారం ‘నల్లబ్యాడ్జీలతో’ సభకు రావాలని వైకాపా నిర్ణయించుకోవడంతో వారంతా సంఘటితంగా రోజా వెన్నంటి ఉండి పోరాడడం కూడా ఉత్తిదే అని తేలిపోతున్నది.
అయినా.. ఈ ఎపిసోడ్లో వైకాపా సభ్యులంతా నల్లచొక్కాలు, నల్ల చీరలు ధరించి వస్తేనే.. ఎలాంటి ఫలితమూ దక్కలేదు.. ఇక నల్ల బ్యాడ్జీలు ధరిస్తే ఏం ఉపయోగం ఉంటుందా? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.