హక్కుల కమిటీ ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకుని, సస్పెన్షన్ ఎత్తివేయించుకోవడానికి ఏపీ శాసనసభ రోజాకు మరొక అవకాశం ఇచ్చింది. రెండు రోజుల కిందట సమావేశానికి ఆమె రాలేదని చర్యకు సిఫారసుచేయడానికి పూనుకుంటూ ఉండగా, వైకాపాకు చెందిన సభ్యులు జ్యోతుల, పెద్దిరెడ్డి ఆమె అనారోగ్యం కారణంగా మరో అవకాశం ఇవ్వాలని అన్నారు. అప్పటికి ప్రివిలేజ్ కమిటీ ఆ మాటను తిరస్కరించినా వైకాపా కోరినట్లుగా.. ఇవాళ శాసనసభ ”మరో అవకాశం” ఇచ్చింది. హక్కుల కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చే వరకు, ఆ తర్వాత కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని.. ఆ తర్వాత నివేదిక ప్రకారం డిసైడ్ చేస్తామని సభలో తేల్చిచెప్పారు.
నిజానికి ఇంతకంటె ఈ సమస్యకు న్యాయబద్ధమైన పరిష్కారం మరొకటి ఉంటుందని అనుకోలేము. అయితే కమిటీ ముందుకు రోజా వెళ్లకపోవచ్చునని పలువురు అనుమానిస్తున్నారు. ఆమె వెళ్లకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కేవలం ‘క్షమాపణ’ చెప్పకుండా తప్పించుకోవడం మాత్రమే కాదు. మరిన్ని కారణాలు ఉన్నాయి. ఆ వివరాలేమిటో చూద్దాం.
హక్కుల కమిటీ ముందుకు వెళితే రోజా మాటల అసలు బండారం బయటపడుతుంది. సభలో ఆమె చేసిన అసభ్య వ్యాఖ్యలు బయటకు వస్తాయి. వాటి గురించి ఆమె వివరణ చెప్పాల్సి వస్తుంది. ఆ భయంతోనే కమిటీ ముందుకు వెళ్లడానికి రోజా భయపడుతున్నట్లుగా పలువురు విశ్లేషిస్తున్నారు.
నిజానికి వైకాపాకు చెందిన మరొక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇలాంటి షాక్‌నే రుచిచూశారు. సభలో గొడవ జరిగిన రోజున జ్యోతుల మీద కూడ సస్పెన్షన్ వేటు పడింది. వైకాపా ఎమ్మెల్యేలు స్పీకరు పోడియం వద్ద వెల్‌లో ఉండి రభస చేస్తుండగా… వారందరినీ సస్పెండ్ చేశారు. ఆ సమయంలో.. స్పీకరును ఉద్దేశించి అమర్యాదకరంగా సంబోధిస్తూ.. తన పార్టీ ఎమ్మెల్యేలతో ఒక బూతు పదం ఉపయోగించి జ్యోతుల నెహ్రూ చాలా తీవ్రమైన వ్యాఖ్య చేశారని విశ్వసనీయ సమాచారం. అయితే ఆయన కమిటీ ఎదుట విచారణకు వెళ్లి.. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కమిటీ ఛైర్మన్ గొల్లపల్లి సూర్యారావు.. ఆయన మాటలను ట్రాన్స్‌స్క్రిప్ట్ చేయించిన ప్రతిని ఆయన చేతికి అందించారు. సభలో గొడవ జరిగిన రోజున జ్యోతుల మాటలన్నీ పక్కాగా రికార్డుల్లోకి వెళ్లాయి. ఆ కాగితం చూసి ఖంగు తిన్న జ్యోతుల వెనక్కు తగ్గి, క్షమాపణ చెప్పేసి.. వేటు లేకుండా చేసుకున్నారు.
ఇప్పుడు రోజా పరిస్థితి కూడా అదే. తానేమీ తప్పుగా మాట్లాడలేదని, సారీ చెప్పాల్సిన అవసరం లేదని రోజా ఇన్నాళ్లుగా అంటున్నారు. ఇప్పుడు ఆమె కమిటీ ముందుకు వెళితే.. వారు రికార్డులు చూపించి, ఆ మేరకు వివరణ అడగవచ్చు. దాంతో ఇక బుకాయించడం కుదరకపోవచ్చుననేది రోజా భయం అని పలువురు విశ్లేషిస్తున్నారు. క్షమాపణచెప్పాల్సిందిగా కమిటీ డిసైడ్ చేయవచ్చునని అంతా భావిస్తున్నారు. రోజా హక్కుల కమిటీ ముందు హాజరు అవుతుందని.. వైకాపా నాయకులు చెబుతూనే ఉన్నారు. అయితే.. ఇలాంటి ప్రాక్టికల్ ఇబ్బందులు, తాను అన్న అసభ్య పదాలు మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉన్నందున రోజా వీలైనంత వరకు వెళ్లకపోవడానికే మొగ్గవచ్చునని పలువురు అనుకుంటున్నారు.