పవన్ కల్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు. అలా అనడం కంటె వ్యవస్థాపకుడు అంటేనే బాగుంటుంది. ఆయనే ఆ పార్టీని స్థాపించారనేది అందరికీ తెలుసు. కానీ అధ్యక్షుడా? కార్యదర్శా? లాంటి వివరాలు మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే.. ఆ పార్టీకి ఇప్పటిదాకా కమిటీనే లేదు. పార్టీలో ఆయన ఒక్కడే తప్ప.. మరొకరు లేరు. అభిమానులంతా ‘మేం పవన్ పార్టీనే’ అనుకోవడమే తప్ప.. ఆయన పార్టీలో ఇప్పటిదాకా ఎవ్వరూ లేరు. పార్టీలో ఆయన ఒక్కడే ఉన్నాడంటూ, కిట్టనివాళ్లు విమర్శిస్తూ ఉంటారు కూడా!
అయితే తాజాగా విడుదలకు సిద్ధం అవుతున్న సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం ట్రైలర్లో పవన్ కల్యాణ్.. ఇలాంటి తన రాజకీయ ఒంటరితనానికి సంబంధించిన విమర్శలకు సమాధానం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూస్తే , కాస్త లోతుగా ఆలోచిస్తే ఆ సంగతి బోధపడుతుంది.
==
పవన్‌కల్యాణ్ సినిమాలో విలన్ ఇలా అడుగుతాడు.
”ఒక్కడివీ ఏం చేయగలవ్ రా?”
”ఒక్కడినే.. ఒక్కడినే…
ఎక్కడికైనా ఇలాగే వస్తా.. ఇలాగే ఉంటా…
జనంలో ఉంటా.. జనంలా ఉంటా…”
అంటూ పవన్ కల్యాణ్ చాల ఫెరోషియస్‌గా జవాబు ఇవ్వడం ఈ ట్రైలర్లో మనకు కనిపిస్తుంది.
‘ఒక్కడినే.. ఒక్కడినే.. అంటూ పవన్ కల్యాణ్ చెప్పే వివరణ.. రాజకీయం ప్రస్తుతం జనసేన పార్టీ అధినేతగా ఏకాకిగా, ఒంటరిగా నడుపుతున్న తీరుపై వినిపించే విమర్శలకు సమాధానం అని అనుకోవచ్చు. తాను ఒక్కడే ఉన్నప్పటికీ కూడా.. జనంలో ఉంటూ.. జనంలాగానే ఉంటూ.. పనిచేస్తానని ఈ డైలాగుల ద్వారా పవన్ రాజకీయ విమర్శకులకు కూడా వివరణ ఇచ్చినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.
అయినా రాజకీయాల్తో కూడా సంబంధం ఉన్న హీరోలు తమ తమ చిత్రాల్లో.. ఆ వాసన కూడా స్ఫురించేలా డైలాగులు వేయడం.. తద్వారా తమ అభిమానులకు కిక్ ఇవ్వడానికి ప్రయత్నించడం మన తెలుగుతెరమీద కొత్త సంగతి కాదు. కాకపోతే.. ఈ డైలాగు కేవలం కిక్ ఇవ్వడానికేనా.. జనసేన అధినేతగా తన రాజకీయ ఒంటరితనానికి కల్యాణ్ సీరియస్ వివరణ కూడానా? అనేది వేచిచూడాలి.