ఏపీ శాసనసభలో జరుగుతున్న వ్యవహారాలను పాలక, ప్రతిపక్షాల్లో ఎవరికి వారు.. తమ తమ వాదనలకు అనుకూలంగా మలచి.. వాటినుంచి లబ్ధి పొందడానికి, తమ వాదనలకు అనుకూలంగా వాటిని వాడుకుని ప్రజల్లో ప్రచారం చేసుకోవడానికి వాడుకుంటున్నారు. రోజా వ్యవహారం ఒక్కటీ పరిశీలించినా సరే.. వైరిపక్షాలు రెండూ.. ఎన్నెన్ని రకాల ఎత్తుగడలకు పాల్పడుతున్నాయో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రోజా సస్పెన్షన్ వ్యవహారం.. ప్రివిలేజ్ కమిటీ విచారణకు ఆమె గైర్హాజరైన తర్వాత.. ఏడాది వేటుకే సిఫారసుతో సభ ముందుకు వచ్చిన తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. ఆమె మళ్లీ విచారణ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవడానికి సభ అనుమతించింది. అప్పటిదాకా సస్పెన్షనే అని తేల్చారు.
అయితే రోజా విచారణ కమిటీ ముందు హాజరై క్షమాపణ చెబితే సరిపోతుందని వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారు. వారి వ్యాఖ్యల్లో, వారి పత్రిక సాక్షి రాతల్లో చాలా టెక్నికల్‌గా విచారణ కమిటీకి సారి చెబితే ఆమె సస్పెన్షన్‌ను పునఃపరిశీలిస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఆలోచిస్తే.. ఎమ్మెల్యే రోజా , తెదేపా ఎమ్మెల్యే అనిత ను దూషించిందనేది ఆరోపణ అయినప్పుడు… సారీ మాత్రం కమిటీకి చెబితే ఎలా కుదురుతుంది?
హక్కుల కమిటీ ఎదుట రోజా తప్పక హాజరవుతుందని వైకాపా నేతలు అంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించినట్లుగా హక్కుల కమిటీ వద్దకు వెళ్లినా కూడా సస్పెన్షన్‌ను ఎత్తేయలేదని ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రభుత్వానికి ఇది ఉపయోగపడుతుంది తప్ప మరో ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే… ప్రివిలేజ్ కమిటీ కేవలం విచారణ జరిపి సిఫారసులు చేస్తుందే తప్ప.. తప్పుచేసిన వారితో క్షమాపణ చెప్పించుకోవడం వారి బాధ్యత కాదు.
‘తనను సభలో అవమానించినందున అదేసభలో క్షమాపణ చెబితే సరిపోతుందని’ ఎమ్మెల్యే అనిత హక్కుల కమిటీని కోరుతున్నారు. అయితే ఎమ్మెల్యే రోజా అందుకు సిద్ధమేనా? అనేది సందేహమే. ఆమె నాలుగు గోడల మధ్య కమిటీకి సారీ చెప్పగలరే తప్ప.. సభా ముఖంగా అనితకు సారీ చెబుతారని ఊహించలేం అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కమిటీకి సారీ చెప్పి తప్పించుకోవడం సాధ్యం కాదని, ఈగో దెబ్బతిన్నా సరే.. అనితకు సారీ చెబితే తప్ప.. రోజా సభాప్రవేశం సాధ్యం కాకపోవచ్చునని పలువురు విశ్లేషిస్తున్నారు.