వైకాపా ఎమ్మెల్యే రోజాపై శాసనసభ విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి హైకోర్టు బెంచ్ లో సవాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దానిపై నిన్న కోర్టులో ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బోస్లే, జస్టిస్ పి. నవీన్ రావుతో కూడిన ధర్మాసనం ఆ కేసుని మంగళవారానికి వాయిదా వేసింది. ఈరోజు దానిపై తమ తీర్పు వెలువరిస్తామని తెలిపారు.
రోజాని సస్పెండ్ చేయమని సిఫార్సు చేస్తూ శాసనసభ హక్కుల కమిటీ ఇచ్చిన నివేదికపై నిన్న శాసనసభలో చర్చ జరిగింది కానీ ఇంకా దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. రోజాపై ఏడాదిపాటు వేటు వేయడం ఖాయమని మాత్రం స్పష్టమయింది. బహుశః ఇవ్వాళ్ళే శాసనసభ కూడా రోజా సస్పెన్షన్ పై తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
న్యాయస్థానం తీర్పును తెదేపా ప్రభుత్వం గౌరవించనందుకు నిరసనగా నిన్న శాసనసభను బహిష్కరించిన వైకాపా శాసనసభ్యులు ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరు కాబోతున్నారు. ఈరోజు కూడా రోజాను మార్షల్స్ అడ్డుకొన్నప్పుడు అందుకు నిరసనగా మళ్ళీ అందరూ కలిసి గాంధీ విగ్రహం వద్ద కూర్చొని ధర్నా చేస్తారా లేకపోతే తెదేపాతో యుద్ధం చేయడానికని ఆమెను బయట విడిచిపెట్టి అందరూ శాసనసభలోకి వెళతారా చూడాలి. కానీ వాళ్ళు ఏమి చేసినా రోజా క్షమాపణ చెప్పుకోనప్పుడు ఆమె సస్పెన్షన్ న్ని అడ్డుకోలేరని చెప్పవచ్చును.