కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా 17 బ్యాంకులకు రూ.9,000 కోట్లు అప్పులు ఎగవేసి మార్చి4న లండన్ పారిపోయారు. సుప్రీం కోర్టు, ఈడి, బ్యాంకులు ఆయనకి నోటీసులు పంపినా ఆయన ఇప్పుడప్పుడే వచ్చే ఉద్దేశ్యం లేదని చెపుతున్నారు. ఇక చేసేదేమీ లేక కనీసం ఏప్రిల్ 2న తమ ముందు హాజరుకమ్మని ఈడి ఆయనకు గడువు పొడిగిస్తూ మళ్ళీ నోటీసు పంపింది. అప్పుడయినా ఆయన వస్తాడనే నమ్మకం లేదు.
ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన ‘పబ్లిక్ టాక్’ కార్యక్రమంలో మాట్లాడుతూ “విజయ్ మాల్యా వ్యవహరిస్తున్న తీరు వలన దేశంలో ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న పారిశ్రామిక, వ్యాపారవేత్తలకి కూడా చెడ్డ పేరు వస్తోంది. దేశంలో అనేక ప్రైవేట్ విమానయాన సంస్థలు నడుస్తున్నాయి. వాటిలో కొన్ని మంచి లాభాలు కూడా ఆర్జిస్తున్నాయి. అంటే కింగ్ ఫిషర్ విమాన సంస్థ నిర్వహణ లోపం కారణంగానే నష్టాలలో కూరుకుపోయిందని అర్ధమవుతోంది. కానీ ఆ నష్టాలతో తన వ్యక్తిగత ఆస్తులకు సంబంధం లేదని వాదిస్తూ విజయ్ మాల్యా తన బాధ్యతల నుండి తప్పించుకోవడం సరికాదు. ఈవిషయంలో నేను ఆర్.బి.ఐ. గవర్నర్ రంగరాజన్ చెప్పిన దానితో ఏకీభవిస్తున్నాను. ఆయన ఒకవైపు బ్యాంకుల దగ్గర అప్పులు చేస్తూ, ఆ అప్పులతో తనకు సంబంధం లేదని చెపుతూ విలాసంగా జీవిద్దామనుకొంటే కుదరదు. దేశంలో అప్పులలో కూరుకుపోయున్న ఇతర ప్రైవేట్ సంస్థలు ఏవిధంగా తన ఆస్తులను అమ్మి బ్యాంకుల బకాయిలు తీర్చుతున్నాయో అదే విధంగా విజయ్ మాల్యా కూడా తక్షణమే భారత్ తిరిగి వచ్చి తన ఆస్తులను అమ్మి అప్పులన్నీ తీర్చవలసి ఉంటుంది. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసి వస్తుంది,” అని చెప్పారు.
ఇప్పుడు విజయ్ మాల్యాని తప్పు పడుతున్న ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మరి ఇన్నాళ్లుగా ఆయన తీరును చూస్తూ కూడా ఎందుకు ఉపేక్షించారు? విజయ్ మాల్యా విదేశాలకు పారిపోతున్నప్పుడు ఆయనని ఎందుకు అడ్డుకోలేదు? ఆయన విదేశాలకు పారిపోతున్నప్పుడు ఆపలేకపోయినా సుప్రీం కోర్టు ఆదేశాలను, భారత చట్టాలను ధిక్కరిస్తూ అయన దేశానికి సవాలు విసురుతుంటే మోడీ ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చొంది? ఇప్పుడు ఈడి నోటీసులు పంపినా కూడా దేశానికి రానని చెపుతున్న ఆయనని అరెస్ట్ చేసి దేశానికి ఎందుకు రప్పించలేకపోతోంది? ఆర్ధిక నేరస్థుడయిన అతనిని అరెస్ట్ చేసి దేశానికి రప్పించే ప్రయత్నం చేయకుండా, భారత్ కి తిరిగి వచ్చి అప్పులు చెల్లించమని ఎందుకు ప్రాధేయపడుతున్నారు? అని ఆలోచిస్తే, ఆయనకీ మోడీ ప్రభుత్వం కూడా అండగా ఉన్నందునే ఆయన దేశం విడిచి పారిపోగలిగారని, అందుకే ఆయన పట్ల కటినంగా వ్యవహరించడం లేదనే అనుమానం కలగక మానదు.