తమ పార్టీ గుర్తు మీద గెలిచి.. అధికార తెలుగుదేశంలోకి ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేల మీద వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆగ్రహం ఉండడం సహజం. అయితే దానికి తగినట్లుగా వారి మీద చర్య తీసుకోవడానికి చూస్తోంటే మాత్రం వీలు చిక్కడం లేదు. ఆ 8 మంది వేటు వేయించేయాలంటే.. స్పీకరు వైపునుంచి స్పందన లేదు. పైగా ‘పార్టీ ఫిరాయించారు గనుక.. వేటు వేసేయండి’ అనే డిమాండు మీద విచారణలు, సంజాయిషీలు కోరడం లాంటి అనేక రకాల ప్రక్రియలు అన్నీ ముగిసే సరికి పదవీకాలం కూడా గడచిపోయే ప్రమాదమూ ఉన్నదని ఆయనకు తెలుసు. అలాంటి నేపథ్యంలో విప్ ధిక్కరణ కంప్లయింటుతో ఆ 8 మంది వేటు వేయడానికి కత్తి దూసినట్లయితే.. చర్యలు తప్పవనే ఆలోచన ప్రతిపక్ష నేత చేస్తున్నట్లుగా ఉంది.
మొన్నటికి మొన్న స్పీకరు మీద అవిశ్వాసం పెట్టిన రోజునే తన పార్టీ సభ్యులకు విప్ జారీ చేయడం ద్వారా ధిక్కరించారనే నెపం వారి మీద మోపడానికి ఆయన వ్యూహరచన చేశారు. కానీ ఇలాంటి ఇబ్బంది ఉంటుందని ముందే గెస్ కొట్టినట్లుగా ఆయన పార్టీనుంచి ఫిరాయించిన 8 మంది ముందురోజు మరియు స్పీకర్‌పై అవిశ్వాసం రోజున కూడా సభకు గైర్హాజరై విప్ సంగతే తమకు తెలియదని చెప్పుకోగల అవకాశం సృష్టించుకున్నారు. వారు విప్ ధిక్కరించి గైర్హాజరైనా.. వారికి అందజేసిన ఆధారాలు లేవు గనుక.. జగన్ ఫిర్యాదు చేయకుండా మిన్నకుండిపోవాల్సి వచ్చింది.
ఇప్పుడు మరోసారి వారి మీద విప్ ధిక్కరణ వేటు వేయించడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ద్రవ్య వినిమయ బిల్లు మీద ఓటింగుకు తప్పకుండా హాజరు కావాల్సిందిగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరికీ వైకాపా మంగళవారం నాడు విప్ జారీచేసింది. అయితే ఈ విప్‌ను కూడా అధికార పార్టీలో చేరిన 8 మంది వైకాపా సభ్యులు ధిక్కరించడం జరుగుతుంది గనుక.. వారి మీద చర్యలకు స్పీకరుకు కొత్త ఫిర్యాదు ఇవ్వవచ్చుననేది ఆయన వ్యూహం. మరి దీనిని వారు ఎలా ఎదుర్కొంటారో.. తమ మీద వేటు పడకుండా, చర్యలు లేకుండా ఎలా తప్పించుకుంటారో వేచిచూడాలి.