వెనకటికి ఓ ప్రబుద్ధుడు పిచ్చి ముదిరితే.. ‘రోకలి తలకు చుట్టమన్నాట్ట’! మన పల్లెపట్టుల్లో బాగా పాపులారిటీ ఉన్న సామెతల్లో ఇది కూడా ఒకటి. అయితే ప్రస్తుతం కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు, తన వ్యక్తిత్వంతో ఎంతో వివాదాస్పదుడిగా దేశవ్యాప్త గుర్తింపు కలిగి ఉన్న శశిథరూర్ వైఖరి గమనిస్తే.. ఈ సామెత కంటె భిన్నంగా ఎంతమాత్రమూ లేదు. ఆయనకు మతి చలించి మాట్లాడుతున్నారేమో అని ఎవరైనా వ్యాఖ్యానించినా, అనుమానించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
తాజాగా జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌ను భగత్ సింగ్, గాంధీ, నెహ్రూ తదితరులంతో కలిపి పోల్చేసి ఆయన కొత్త వివాదాన్ని నెత్తిన పెట్టుకున్నారు. కన్హయ్య- భగత్‌సింగ్ ఇద్దరూ ఒకటే తరహా పోరాట యోధులు అంటూ వ్యాఖ్యానించి వివాదాన్ని నెత్తిన పెట్టుకున్నారు. పాకిస్తాన్‌కు జైకొట్టిన ఒక కుర్రాడిని, భారతమాత కోసం ప్రాణాలు ఇచ్చిన భగత్‌సింగ్‌తో పోల్చడం అంటేనే.. ఎంత చవకబారు రాజకీయ గిమ్మిక్కులకు ఆయన తెగబడుతున్నారో ఇట్టే అర్థమైపోతుంది. ఆయన ఎంత దిగజారిన వ్యాఖ్యలు చేశారంటే.. కనీసం ఆయన సొంత పార్టీ నాయకులు కూడా ఈ మాటల్ని సమర్థించలేదు. భాజపా నాయకులంతా మూకుమ్మడిగా వాగ్దాడికి దిగడం సహజం అనుకోవచ్చు. కానీ… కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ కూడా ‘ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం’ అని తప్పించుకోజూస్తే ఏమనుకోవాలి. ఖచ్చితంగా శశిథరూర్ మతిచలించి అవతలి వారిని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో బుర్రలేకుండా మాట్లాడుతున్నారనే అనుకోవాలి. భగత్‌సింగ్ తో కన్హయ్య సమానం అని తాను అనలేదని, వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఒకే తరహావి అని పోల్చానని ఆ తర్వాత థరూర్ ఇచ్చిన వివరణలు ఎవ్వరికీ రీచ్ కాలేదు.
ఆయన వ్యాఖ్యలు గాడి తప్పుతున్నాయనడానికి కేవలం కన్హయ్య ఉదంతం ఒక్కటే కారణం అనుకుంటే పొరబాటు. స్వలింగ సంపర్కుల హక్కుల గురించి ఆయన కొన్ని రోజుల కిందట మాట్లాడుతూ.. అర్థనారీశ్వరుడు కూడా సగం మగ- సగం ఆడ కదా.. అంటూ పరమశివుడిని హిజ్రాలతో పోలుస్తూ మరో వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు గనుక.. భాజపాకు కోపం తెప్పించే వ్యాఖ్యలు చేయాలని ఆయన అనుకుంటుండవచ్చు. స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడడం తన బాధ్యత అని.. అసలే బహుభార్యా ప్రియత్వంలో మునిగి తేలిన ఈ రొమాంటిక్ నాయకుడు ఆశపడవచ్చు. కానీ అందుకు మరీ నీచంగా హిందూ విశ్వాసాన్ని కించపరిచేలా దేవుళ్లను కూడా వివాదంలోకి లాక్కురావడం ఎందుకు? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
నాయకులు తమ మాటకు చాలా విలువ ఉంటుందని తెలుసుకోవాలి. మాట బయటకు చెప్పే మందు ఓసారి సమీక్షించుకోవాలి. అలాంటప్పుడు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా ఉంటారు.