వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి లెక్కలు వేసుకున్నారో గాని మొదటి సారి ఎమ్మెల్యే అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చి సొంత పార్టీ లో ముసలం పెట్టుకున్నారా అనే అనుమానాలు తాజాగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. భూమా నాగిరెడ్డి టీడీపీ లోకి వెళ్ళిపోయిన తరవాత ఆ పదవిపై వైసీపీ లో చాలామంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ పార్టీ లో ఎవ్వరినీ సంప్రదించకుండానే బుగ్గనను ఎంపిక చేయడం జరిగిపోయింది. దీనిమీద అసెంబ్లీ లాబీల్లో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య జరిగిన సంభాషణ వైసీపీ లో ప్రబలుతున్న అసంతృప్తికి నిదర్శనం గా కనిపిస్తోంది.
లాబీల్లో జ్యోతుల నెహ్రు ఎదురుపడగానే ఆయనకు పదవి వస్తుందని ఊహించాం అంటూ డిప్యూటీ సీఎం చినరాజప్ప, ధూళిపాళ నరేంద్ర అన్నారు. టీడీపీ లో ఉండి ఉంటే జ్యోతులకు డిప్యూటీ సీఎం పదవి దక్కి ఉండేదని ధూళిపాళ అన్నారు. పదవులు తన వద్దకు రావాల్సిందే తప్ప తానూ పదవుల వద్దకు వెళ్లానని అంటూ జ్యోతుల వారికి జవాబిచ్చారు.
ఈ లోగా చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి జోక్యం చేసుకుని తన అసంతృప్తి ని కూడా పరోక్షంగా బయట పెట్టారు. వైసీపీ కి చెందిన ఆయన.. కాపు వర్గం నేత గనుక జ్యోతులకు పదవి దక్కుతుందని అనుక్కున్నట్లు వెల్లడించడం విశేషం. నిజానికి వైసీపీ నుంచి ఈ పదవిని ఆశించిన వారిలో జ్యోతుల తో పటు అమరనాథ్ రెడ్డి కూడా ఉన్నారు. అదే సమయంలో అయన టీడీపీ వైపు చూస్తున్నట్లు కూడా కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి కీలక సమయంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం. పైగా అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా వాళ్ళు తెలివైన వాళ్ళని అందరు అనుకుంటారు. కానీ ప్రతిసారి నష్టపోయేది వాళ్ళే అని చెప్పడాన్ని గమనిస్తే.. అయన అసంతృప్తి అర్ధం అవుతుంది.
ఈ మొత్తం ఎపిసోడ్ గమనించినప్పుడు పీఏసీ చైర్మన్ పదవి కి బుగ్గన ఎంపిక ద్వారా.. జగన్ తనసొంత పార్టీలో ముసలం పెట్టుకున్నారు అనిపిస్తోంది. మరికొందరు పార్టీ వీడి పోవడానికి అయన రంగం సిద్ధం చేసారా అనిపిస్తోంది.