ఆర్.కె.రోజా సస్పెన్షన్‌పై సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వును ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం కొట్టివేయడంతో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్టే. రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ శాసనసభ చేసిన తీర్మానంలో 340(2) నిబంధనను పొందుపర్చడం సరికాదంటూ సింగిల్ జడ్జి రామలింగేశ్వరరావు ఉత్తర్వునిచ్చారు. అయితే అదే సమయంలో శాసనసభ అధికారాన్ని స్పీకర్ పరిధిని ప్రశ్నించలేదు. పైగా నాలుగు వారాలు దీనిపై విచారణ జరపాలని కూడా నిర్ణయించారు. ఈ మధ్యలో ఇచ్చిన మద్యంతర ఉత్తర్వు ఆధారంగా శాసనసభలో ప్రవేశించాలని రోజా చేసిన ప్రయత్నాన్ని ప్రభుత్వం అడ్డుకోవడంతో వైసీపీ తీవ్ర నిరసన కార్యక్రమాలే చేపట్టింది. కోర్టు ధిక్కారణ నేరం ఆరోపణ చేసింది. అయితే ప్రభుత్వం వ్యూహాత్మకంగా విస్త్రత ధర్మాసనం విచారణకు అప్పీలు చేస్తూనే సస్పెన్షన్‌పై హక్కుల సంఘం నివేదికను చర్చకు చేపట్టింది. తాత్కాలిక ఫ్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.భోస్లే, పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి మంగళవారానికి తీర్పు రిజర్వు చేసింది. ఈ కారణంగా ప్రభుత్వం కూడా హక్కుల సంఘం నివేదికపై తుది నిర్ణయం ప్రకటించకుండా, రోజా దాని ముందు హాజరై క్షమాపణ చెబితే పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. న్యాయస్థానంలో నిన్న వాదోపవాదాల సందర్బంలోనూ న్యాయమూర్తులు వేసిన ప్రశ్నలు వైసీపికి వ్యతిరేక దిశలోనే వున్నాయి. సభలోకి అనుమతించాలని మద్యంతర ఉత్తర్వులో లేదు కదా అనీ, విచారణ కమిటీ ముందు హాజరై క్షమాపణ చెప్పవచ్చు కదా…అని వారు అడిగారు. వైసీపీ తరపు న్యాయవాది దీనిపై సూటిగా సమాధానం ఇవ్వలేదు. మంగళవారం వెలువడే తీర్పును చూశాకనే తుది నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం కూడా వ్యవధి తీసుకుంది. దీనిపై కమిటీ ముందు హాజరు కావాలా…వద్దా..అన్నది వైసీపీ నిర్ణయించుకోవాలసి ఉంది. కానీ దానిపై రెండు విధాలుగా మాట్లాడుతూ తన వ్యూహాత్మక గందరగోళాన్ని వెల్లడించుకుంది. హాజరవుతామని ఒకసారి, ఈ కమిటీలు వేరువేరని మరోసారి మాట్లాడింది. అయితే ఆ పార్టీ సభ్యులు సభకు మాత్రం హాజరైనారు. ఈ లోగా హైకోర్టు ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వును పక్కన పెట్టడంతో వైసీపీ వాదన వీగిపోయి, ప్రభుత్వానికే బలం చేకూరినట్లయింది. ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లడం అనివార్యంగా మారింది కానీ అక్కడైనా వెంటనే రోజాకి ఉవపశమనం లభించకపోవచ్చు. ఎందుకంటే అసాధారణ పరిస్థితుల్లో తప్ప న్యాయస్థానాలు చట్టసభల వ్యవహారాలలో తలదూర్చవు. గతంలో చెప్పినట్టే మరోసారి హైకోర్టుకే వెళ్లవలసిందని ఆమెకు సూచించవచ్చు. ఇప్పుడు రోజా కమిటీ ముందు హాజరై తన వాదన చెప్పడానికి సిద్ధపడుతుందా? లేక ప్రభుత్వం ఆమె రాకపోతే అనుకున్న ప్రకారం ఏడాది సస్పెన్షన్‌కే కట్టుబడివుంటుందా? అంటే అలా జరిగే అవకాశమే ఎక్కువ. ఎందుకంటే రోజాపై రాజకీయ కక్ష గట్టారన్న ఆరోపణ కన్నా ఆమె మాటలకు ఆగ్రహించిన ప్రభావమే ఇక్కడ ఎక్కువగా వుంది. ఇందుకు సంబంధించి పాలకపక్ష నేతలు రకరకాల కథలు చెబుతున్నారు. కొంతమంది వైసీపీ ఎంఎల్‌ఎలే ఇలాటి కబుర్లు చెప్పడం విశేషం. రోజా కమిటీ ముందు హాజరై ‘సారీ’ చెబితే పోయేదానికి తమ నాయకుడు జగన్ అనవసరంగా ఇంత తతంగం నడిపిస్తున్నారని ముఖ్య నాయకులే విసుగు వ్యక్తం చేస్తున్నారు. దుర్బాషలు తప్ప సమస్యలపై మాట్లాడని ఆమెను ఎందుకు ఇంతగా వెనకేసుకురావాలని ప్రశ్నిస్తున్నారు. మామూలుగా రూపాయి విదల్చని తమ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఈ కేసులో వాదించడానికి చాలా భారీగా సహాయం చేశాడని ఒక శాసనసభ్యుడు పెద్ద అంకె చెప్పాడు. మొత్తంపై ఈ విషయంలో తమ వ్యూహం బాగా లేదనే భావన వైసీపీలో చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అతి విశ్వాసంతో తప్పటడుగులు చేసి లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టారని తెలుగుదేశం ఎంఎల్ఎలు గట్టిగానే విమర్శిస్తున్నారు. ప్రతిదానికి ఏదో రూలు చెప్పి అడ్డుపడే బదులు మాట్లాడనిస్తే కొంపేం మునుగుతుందని వారు అడుగుతున్నారు.