హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ మరణం తరువాత శలవు మీద వెళ్ళిన వైస్ ఛాన్సిలర్ అప్పారావు ఈరోజు తిరిగి బాధ్యతలు చేపట్టడానికి రావడంతో ఒక్కసారిగా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విద్యార్ధులు ఆయన రాకను నిరసిస్తూ యూనివర్సిటీ ఆయన కార్యాలయాన్ని ద్వంసం చేసారు. “అప్పారావు డౌన్ డౌన్…అప్పారావు గో బ్యాక్” అంటూ నినాదాలు చేస్తూ విద్యార్ధులు యూనివర్సిటీ ప్రాంగణంలో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అప్పారావు విద్యార్ధుల తీరును తప్పు పట్టారు. శలవు మీద వెళ్ళిన తను తిరిగి వచ్చి అధికారులతో సమావేశామవుతుంటే, విద్యార్ధులు ఈవిధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. అయినా తను ఇంకా బాధ్యతలు చేపట్టలేదని, యూనివర్సిటీకి సంబంధించి అత్యవసర విషయాలను చర్చించేందుకే అధికారులతో సమావేశమయ్యానని చెప్పుకొన్నారు.
రోహిత్ మృతిపై రాజకీయ పార్టీలు ఆసక్తి కోల్పోయాయని అర్ధమవుతూనే ఉంది. కానీ ఆ సమస్య మాత్రం నేటికీ పరిష్కరించబడలేదు. కొన్ని రోజులు ఊరుకొంటే పరిస్థితులు వాటంతట అవే సర్దుకొంటాయనే ఉద్దేశ్యంతోనే అప్పారావు శలవుపై వెళ్ళిపోయారు. పరిస్థితులు సర్దు మణిగినట్లు కనబడగానే బాధ్యతలు చేపట్టడానికి తిరిగి వస్తే విద్యార్ధుల నుండి వ్యతిరేకత ఎదురయింది. రోహిత్ ఆత్మహత్య కేసుని అటకెక్కించడం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదని అందరికీ తెలుసు. కానీ విద్యార్ధులలో అప్పారావు పట్ల నెలకొన్న వ్యతిరేకతను తొలగించడం సాధ్యం కాదు కనుక, ఆయనను వేరే యూనివర్సిటీకి బదిలీ చేయడం ద్వారా ఆయన సమస్యను పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందేమో? అంతకంటే వేరే మార్గం కూడా కనబడటం లేదు.