లేనిపోని సమస్యలు తీసుకొస్తే లేనిపోని వివాదాలే పెరుగుతాయి. భరత్ మాతా కి జై అనని వారు ఈ దేశంలో ఎలా వుంటారు? అసలు ఏం భారతీయలు అని బిజెపి/ఆరెస్సెస్/ఎబివిపి నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మొన్న బిజెపి జాతీయ కార్యవర్గంలోనూ ఇదే ప్రధానాంశమైనట్టు మాట్లాడారు. అసదుద్దీన్ ఒవైసీ వంటివారు దీన్ని అవకాశంగా తీసుకుని నేను అనను అంటూ మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర శాసనసభలో అలాగే మాట్లాడినందుకు మజ్లిస్ ఎంఎల్ఎను సస్పెండ్ చేశారు. ఇంకా కొన్ని చోట్ల కూడా ఇదే జరిగింది. రాజ్యాంగంలో ఎక్కడా భరత్ మాతా కి జై నినాదం చేయడం తప్పనిసరి అని లేనప్పుడు ఈ విధమైన నిర్బంధం ఏమిటని చాలా మంది ప్రశ్నించారు. అయితే రాజ్యసభలో చర్చ సందర్భంలో సీతారాం ఏచూరి మరో ఆసక్తికరమైన అంశం లేవనెత్తారు. జైహింద్ అనో, హిందూస్థాన్ జిందాబాద్ అనో అంటో వారు దేశభక్తులు కాదా? బిజెపి అంతగా చెప్పే నేతాజీ జైహింద్ అనే కదా అన్నారు! భగత్ సింగ్ నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్! జాతిపిత గాంధీజీ రోజూ భారత్ మాతాకు జై అన్న దాఖలాలున్నాయా? పోనీ వివేకానందుడు.. ? చాలామంది బిజెపి ఆరెస్సెస్ నాయకులు మాత్రం మాటిమాటికి అంటున్నారా? వందేమాతరం గీతం కొన్ని ప్రత్యేక పరిస్థితులలో జాతీయ గీతంగా ఎన్నికైనప్పుడు కూడా అనేక చరణాలు తొలగించడానికి చారిత్రికమైన కారణాలే వున్నాయి. సారాజహాసే అచ్చా హిందూ సితా హమారా అన్న ఇక్బాల్ పాట ఇప్పటికి మనం పాడుకోమా?కనుక దేశంలో ఒకరి జాతీయతకు మరొకరు షరతులు పెట్టడం దానికి కొలబద్దలు ప్రతీకారాలు శిక్షలు నిర్ణయించడం ప్రజాస్వామ్య స్పూర్తికే విరుద్ధం.దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్టు సాక్ష్యాధారాలుంటే వెంటనే చర్య తీసుకోవచ్చు గాని రోజూ నినాదాలపై నిఘా మాటలపై వేట మంచిది కాదు.