జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి మార్గం సుగమమయినట్లే కనిపిస్తోంది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పి.డి.పి.) అధినేత్రి మహబూబా ముఫ్తీ ఇవ్వాళ్ళ ప్రధాని నరేంద్ర మోడితో సమావేశమయ్యి, ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధానితో జరిగిన సమావేశం చాలా సంతృప్తికరంగా ముగిసిందని చెప్పారు. మార్చి 24న పి.డి.పి. శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఆమె తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మరణించిన తరువాత, ఆయన హయంలో భాజపా- పి.డి.పి.ల మధ్య చేసుకొన్న ఒప్పందాన్ని అమలుచేయాలని పట్టుబడుతూ, గత మూడున్నర నెలలుగా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా మహబూబా చాలా తాత్సారం చేసారు. ఆ కారణంగా రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగి ఏప్రిల్ 8నాటికి ఆరు నెలలు పూర్తవుతాయి. కనుక ఏప్రిల్ 8లోగా ఎట్టి పరిస్థితులలో మళ్ళీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది కనుకనే మహబూబా ముఫ్తీ ప్రభుత్వ ఏర్పాటుకి తొందరపడుతున్నట్లున్నారు. మార్చి 24న లాంచనంగా శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి, అదే రోజున భాజపాతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి తమ పార్టీ సిద్దంగా ఉందని ఆమె గవర్నర్ కి తెలియజేయవచ్చును. అంటే ఈ నెలాఖరులోగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని భావించవచ్చును.