బెలిజియం రాజధాని బ్రసిల్స్ నగరంలో జవెంటెం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం రెండు వరుస బాంబు ప్రేలుళ్ళు జరిగాయి. దానిలో కనీసం 11మంది మరణించినట్లు సమాచారం. బాగా రద్దీగా ఉన్న సమయంలో ప్రేలుళ్ళు జరగడంతో చాలా మంది గాయపడ్డారు. విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ కి చెందిన కౌంటర్ కి సమీపంలో ఈ బాంబు ప్రేలుళ్ళు జరిగినట్లు తెలుస్తోంది. అంటే అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానించవలసి వస్తోంది. సరిగ్గా అదే సమయంలో విమానాశ్రయానికి సమీపంలోనే ఉండే మెయిల్ బీక్ అనే మెట్రో రైల్వే స్టేషన్ లో కూడా మరో ప్రేలుడు జరిగినట్లు తెలుస్తోంది. విమానాశ్రయంలో బాంబు ప్రేలుడు తరువాత తుపాకుల కాల్పులు, అరబిక్ బాషలో ఏవో కేకలు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. ఈ దాడి జరిగిన వెంటనే బెల్జియం ప్రభుత్వం హై-అలర్ట్ ప్రకటించింది. ప్రేలుళ్ళ సంగతి తెలియగానే భద్రతా దళాలు విమానాశ్రయాన్ని, మెట్రో రైల్వే స్టేషన్లని చుట్టుముట్టి, ఈ దాడికి పాల్పడిన వారి కోసం వెతుకుతున్నాయి. విమానశ్రయంలో మరో మూడు బాంబులను కనుగొని వాటిని నిర్వీర్యం చేసారు. ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి తామే పాల్పడినట్లు ప్రకటించలేదు.