కొన్నిసార్లు ఒకరి మాటలు వారికే ఎదురుకొడుతుంటాయి. దేశంలో పాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు కావాలని బిజెపి చెబుతుంటుంది. అది దాని మౌలిక విధానం. కాని చాలా పెద్దదైన ఉత్తర ప్రదేశ్‌ను అయిదు రాష్ట్రాలుగా విభజించాలని ప్రతిపాదన వస్తే ససేమిరా అంటుంది. తెలంగాణలాగే చాలా కాలంగా వినిపిస్తున్న నినాదం విదర్భ. యుపిఎ ప్రణాళికలోనూ ఆ ప్రస్తావన వుంది. అయితే ఇప్పుడు విదర్భతో పాటు మరాట్వాడా రాష్ట్రం కూడా ఏర్పాటు చేయాలన్న నినాదం వినిపించే సరికి అధికారంలో వున్న దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. అది కూడా ఏకంగా అడ్వకేట్ జనరల్‌గా వున్న శ్రీహరి అనే ఆ వాదన లేవనెత్తడం మరింత ఇబ్బందిలో పడేసింది. గతంలో రైతుల పరిహారం గురించి కూడా హైకోర్టులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండించి చర్చకు కారకుడైన శ్రీహరి అన్నే ఆదివారం నాడు రైతులకు పరిహారం పంపిణీ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. విదర్భ రాష్ట్ర విభజన అవసరమే అయినా దాంతోపాటే మరాట్వాడాను కూడా విభజించాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై శాసనసభలో ప్రతిపక్షాలతో పాటు ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న శివసేన కూడా నిరసన తెల్పింది. ఆయనను కొనసాగించడం సరికాదని పట్టుపట్టింది. ఎజిని గవర్నర్ నియమిస్తారు గనక ఆయనకే తొలగింపుపైనా అధికారం వుంటుందని ముఖ్యమంత్రి ఫఢ్నవిస్ వాదించారు. చివరకు మంగళవారం నాడు శ్రీహరి అన్నే గవర్నర్ విద్యాసాగర రావును కలసి రాజీనామా ఇచ్చేశారు. ఇక రాష్ట్ర విభజన ఉద్యమం ఏమవుతుందో చూడాలి! బిజెపి అధికారంలో వుంది గనక బహుశా అంగీకరించకపోవచ్చు.