రోజా కేసులో హైకోర్టు ఆదేశాల తర్వాత క్షమాపణ చెబితే తప్ప పున: పరిశీలనకు అవకాశం లేదని స్పష్టంగా చెప్పొచ్చు. ఆ విషయంలో ఆమె ఆపార్టీ వైసీపీ ఏం చేస్తారనేది ఒకటైతే అసలు అసెంబ్లీకి పెద్ద బెడదగా మారిన బూతు పురాణాలను ఎలా కట్టడి చేయాలన్నది అసలైన సవాలుగా వుందంటున్నారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య దుర్భాషల యుద్ధం నడుస్తుందనే చెప్పాలి. అవతలి పార్టీ వారు లేచి నిలబడగానే అసభ్య పదాలతో దూషించడం పరిపాటిగా మారింది. ఈ విషయంలో ప్రత్యేకించి కొందరిని లక్ష్యంగా చేసుకుంటున్నారట. వారు బయిట ఎదురుపడినప్పుడు కూడా భరించలేని బూతులతో పలకరించి చిన్నబుచ్చుతున్నారు. అవి చెప్పుకోలేక వూరుకోలేక సభలో గొడవ చేస్తున్నామని అంటున్నారు. ఈ విషయంలో రోజా మిగిలిన వారికంటే బాగా తీవ్రంగా తిడుతున్న మాట నిజమేనని వైసీపీ సభ్యులు కూడా ఆఫ్ ద రికార్డుగా సాక్ష్యమిస్తున్నారు. జగన్పై ఎక్కువగా దాడిచేసే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎదురైనప్పుడు ఆమె అన్నమాటలు తట్టుకోలేక వైసీపీ ఎంఎల్ఎ ఒకరు తనతో చెప్పినట్టు టిడిపి మాజీ మంత్రి వెల్లడించారు. నిజంగా అలాటి మాటలు అక్కడ వినిపిస్తాయని ఎవరూ వూహించరు. అలాగే జగన్ లేచి మాట్లాడుతున్నప్పుడు తమ పార్టీ వారు కామెంట్లలో ఎలాటి పదాలు వాడారో తెలుగుదేశం తరపున మాట్లాడే ఒక మిత్రుడు చెప్పినప్పుడు చెవులు మూసుకోవలసిందే. స్పీకర్ కోడెల శివ ప్రసాదరావుపై కూడా ప్రత్యక్షంగా ఇలాటి పదప్రయోగాలు చేసినందువల్లనే కోపం పెరిగిందని చెబుతున్నారు. కొడాలి నాని వాడిన కొన్ని పదాలు ఆయనను వెంటాడుతున్నాయి. మొత్తంపైన చట్టసభలు ఇలా దిగజారడానికి తమ బాధ్యత ఎంత అని ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి.ప్రజలు ఎన్నుకుని పంపింది సమస్యలు చర్చించిమేలు చేయడానికే తప్ప బూతు పంచాంగాల కోసం కాదు.