తెలంగాణ రాజకీయాలలో టిఆర్ఎస్ దూసుకుపోతున్నట్టు రోజురోజుకు మరింతగా అర్థమవుతుంది. కాని అందుకు సంతోషిస్తూనే పూర్తిగా ఆనందం పంచుకోలేకపోతున్న ముఖ్యనాయకులొకరున్నారు. ఒకప్పుడు కెసిఆర్ తర్వాత అంతటి నేతగా పేరు తెచ్చుకున్న హరీష్ రావు ఇప్పుడు ఆచితూచి అతి జాగ్రత్తగా అడుగులు వేయవలసిన పరిస్థితి. వారసత్వ ప్రక్రియలో కుమారుడినే కెసిఆర్ పూర్తి స్థాయిలో ప్రతిష్టించిన తర్వాత ఆ ప్రభావం అనేక రూపాల్లో ప్రత్యక్షమవుతున్నది.
కీలకమైన ప్రకటలు తెలియకుండానే వచ్చేస్తుంటాయి. ముఖ్యమైన బాధ్యతలను అప్పగించి ముందు నిలపడం తగ్గుతున్నది. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలలో రెబల్స్ అంతమంది పోటీకి నిలవడం కూడా ఆయనను ఇబ్బంది పెట్టింది. చివరకు ఆయన వల్లనే గట్టెక్కామని కెసిఆర్ కూడా అంగీకరించవలసి వచ్చింది. నారాయణఖేడ్‌లో కూడా బుల్లెట్లా దూసుకుపోతాడని కితాబిచ్చి వచ్చారు. గతం కన్నా తగ్గినా అప్పుడప్పుడూ మాటల్లో కాస్త అభినందిస్తున్న ముఖ్యమంత్రి చేతల్లో మాత్రం హరీష్ ప్రాధాన్యత తగ్గిందని సంకేతాలు ఇస్తున్నారు. బడ్జెట్లో నీటి ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించారు. కాని వాటి నిర్వహణ బాధ్యత సంబంధిత శాఖ చూస్తున్న హరీష్‌కు వదలిపెట్టలేదు. తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్‌లతో పాటు ఒక కమిటీని వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రాజెక్టుల ఘనత పూర్తిగా హరీష్‌కు దక్కకుండా చేసేందుకు, నిధుల వినియోగంలోనూ ఆయనకు మాత్రమే అధికారం వుండే పరిస్థితి లేకుండా అడ్డుకోవడానికి ఈ కమిటీ వేశారని హరీష్ అనుయాయులు భావిస్తున్నారు. తుమ్మలను తీసుకురావడంలోనూ అడుగడుగునా ఆయనను ముందుకు తేవడంలోనూ కెసిఆర్ మొదటినుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఈ శిబిరం అభిప్రాయంగా వుంది. కాని ఎంత చేసినా కెటిఆర్ అందరినీ ఆకట్టుకోలేకపోతున్నారని వీరంటున్నారు.