రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు బ్యాంకులకి కుచ్చు టోపీలు పెడుతుండటం చాలా కాలంగా జరుగుతున్నదే. అయితే వారిలో చాలా మంది తమ రాజకీయ సంబంధాలను ఉపయోగించుకొనో లేక వేరే విధంగానో తమ పేర్లు బయటకి పొక్కనీయకుండా నిలుపుకొనేవారు. ఆ కారణంగా “ఆల్ ఈజ్ వెల్-అందరూ పెద్ద మనుషులే” అన్నట్లుగా సాగిపోతుండేది. కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత, బ్యాంకులకి కుచ్చు టోపీలు పెడుతున్న ఆ పెద్దమనుషుల పేర్లు వరుసగా బయటపడుతున్నాయి.
కావూరి సాంభశివరావు సార్వత్రిక ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ నుండి భాజపాలోకి దూకేసినప్పటికీ, మోడీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆయన పేరే మొట్ట మొదట బయట పడింది. ఆయన బ్యాంకులకు ఏకంగా రూ.1000 కోట్లు ఎగవేసిన సంగతి ఆ బ్యాంకుల ఉద్యోగులు హైదరాబాద్ ఆయన కార్యాలయం ముందు ధర్నా చేస్తే బయటపడింది. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న సుజన చౌదరి రూ.100 కోట్లు చెల్లించకపోవడంతో సిబీఐ నుండి నోటీసు కూడా అందుకొన్నారు.వీరందరినీ మించిపోతూ విజయ్ మాల్యా ఏకంగా రూ.9,000 కోట్లు నామం పెట్టేసి లండన్ పారిపోయారు. ఆయన పెద్దల సభ అంటే రాజ్యసభ సభ్యుడు కూడా.
ఇప్పుడు ఆ ఎగవేతదారుల జాబితాలో మరో పేరు వచ్చి చేరింది. ఆయన కూడా మాజీ రాజ్యసభ సభ్యుడు కావడం విశేషం. ఆయనే వైస్రాయి హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఈరోజు ఆయన ఇంటి ముందు ఓరియంటల్ బ్యాంక్ ఉద్యోగులు ధర్నా చేసారు. ఆయన తమ బ్యాంకు వద్ద తీసుకొన్న అప్పులను తక్షణమే తీర్చాలని కోరుతూ వారు ధర్నా చేసారు.
సామాన్య ప్రజలు కొన్ని వేలు లేదా లక్షలు తీసుకొంటే వారి వద్ద నుంచి ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేసే బ్యాంకులు ‘పెద్దమనుషులు’ వందల కోట్లు తీర్చకపోతే వారి ఆస్తులను జప్తు చేసి తమ డబ్బు వాపసు పొందే ప్రయత్నం చేయకుండా, ఈవిధంగా వారి ఇళ్ళ ముందు నిలబడి తమ అప్పులు తీర్చమని ప్రాధేయపడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వారి నిస్సహాయతని చూసి ప్రజలు నవ్వుకొంటున్నారు. కానీ ఇంత కాలానికి బ్యాంకులకి ఈ మాత్రం ధైర్యం చేయగలుగుతున్నాయని సంతోషించక తప్పదు.